Sunday, December 22, 2024

ఆయిల్ పామ్ సాగులో లక్ష్యాన్ని చేరేలా పనిచేయాలి : కలెక్టర్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట అర్బన్ : ఆయిల్ పామ్ సాగులో వేగం పెంచి లక్ష్యాన్ని చేరేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 2059 ఎకరాలు సేకరణ 600 ఎకరాల పైన మొక్కలు పెట్టడం పూర్తి చేశారని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునిత తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు అత్యంత లాభదాయకమైన పంట ఆయిల్ పామ్ సాగు జిల్లాలో వేగవంతం చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైందని రైతులు పంటలు వేసే లోపు వారితో మాట్లాడి ఆయిల్ పామ్ సాగుచేసేలా ప్రేరేపించాలన్నారు. ఈనెలలోనే సగం టార్గెట్ పూర్తి చేయాలన్నారు.

ఏఈఓలు రైతుల ఇంటికి వెళ్లి ఆయిల్ పామ్ వల్ల కలిగే లాభాలు తెలిపి ప్రేరణ కల్పించాలన్నారు. ఆయిల్ పామ్ సాగులో దశలు రైతులను ఎంపిక చేయడం, డిడి కలెక్షన్లు, మార్కింగ్ ,డ్రిప్ ఫిట్టింగ్ మొక్కలు పెట్టడం అనే ప్రక్రీయను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏఓలు మీ మండలంలోని పనిలో వెనుకబడిన క్లస్టర్‌ను రోజువారి పర్యవేక్షణ చేయాలన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆకాల వడగండ్ల వర్షాల వల్ల వరి పంట నష్టాలను తెలుపుతూ పంటలో మార్పులు తీసుకొని ఆయిల్‌పామ్ సాగువల్ల వచ్చే లాభాలను తెలుపుతూ రైతులను ప్రోత్స హించాలన్నారు. పెద్ద భూస్వాములనే కాకుండా చిన్న, సన్నకారు రైతులను కూడా ఆయిల్ పామ్ వైపు మళ్లించాలి. వ్యవసాయ శాఖ, ఉద్యావన శాఖ, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అధికారులు అందరు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, ఆయిల్ ఫెడ్ కార్పరోషన్ మేనేజర్ సురేందర్ రెడ్డి, కార్పోరేషన్ ఇంచార్జి సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News