మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ప్రస్తుతం కెజియఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో కొన్నిరోజుల ముందు సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 25, 2026లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా అందరినీ అలరించనుంది.
ఎన్టీఆర్ నీల్ చిత్రంలో తారక్‌ను పవర్‌ఫుల్ పాత్రలో ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్టోరీతో ఈ సినిమా రానుంది. బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించటంలో ప్రశాంత్ నీల్‌కు ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. తనదైన స్టైల్లో ఎన్టీఆర్‌ను ఇప్పటి వరకు ఎవరూ వెండితెరపై చూపించని విధంగా సరికొత్త మాస్ అవతార్‌లో నీల్ ఆవిష్కరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భువన్ గౌడ సినిమాటోగ్రఫర్‌గా, రవి బస్రూర్ మ్యూజిక్ డైరెకర్‌గా పని చేస్తున్నారు.