మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శానసనభ ఎన్నికల నిర్వహణకు దాదాపు రూ.500 కోట్లు వ్యయం అవుతుందని ఎన్నికల సంఘం లెక్కలు వేసినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇండెంట్ పంపినట్టు తెలుస్తున్నది. ఆ నిధులను విడుదల చేయాలని సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్టు వినికిడి. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలకు సుమారు రూ.370 కోట్ల వరకు ఖర్చయిందని అధికార వర్గాల సమాచారం . ఈ సారి 30 శాతం ఖర్చు ఎక్కువగా ఉంటుందని అంచనాతో ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. శాసనసభ ఎన్నికల ఖర్చును ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.
ఈవిఎం మిషన్ల సేకరణ, నిర్వహణ, భద్రపరచడం వరకు అయ్యే ఖర్చును ఎన్నికల సంఘం చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల నామినేషన్ మొదలు, ఫలితాలు వచ్చేవరకు ఎన్నికల విధులు నిర్వహించే స్టాఫ్, పోలీసులకు ట్రాన్స్‌పోర్టు, అలవెన్సులు చెల్లించాల్సి ఉంటుంది. పోలీసులు, పోలింగ్ స్టాఫ్‌కి పెద్దఎత్తున ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు. గతంలో పోలింగ్ రోజున అలవెన్సుల విషయంలో ఎంప్లాయీస్ ఆందోళనలు చేసిన సందర్భాలున్నాయి. దీంతో అలవెన్సులు ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.