మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా భారీ వాహనాలతో రాకపోకలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. వీటిలో ప్రధానంగా వ్యక్తిగత వాహనాలైనా కార్లు, ద్విచక్ర వాహనాలను మినహాయిస్తే రవాణ వాహనాలైనా లారీలు, టిప్పరు, డీసీఎం, ప్రైవేటు ట్రావెల్ బస్సులు, ట్రాలీలు, వంటివి నిబంధనలకు విరుద్దంగానే తిరుగుతున్నాయి. నిర్ణీత బరువు కంటే ఎక్కువ సామర్ధ్యంతో సరుకు రవాణ చేస్తున్నారు. నిత్యం వివిధ వాహనాలలో వడ్లను ఒక చోట నుంచి మరొక్క చోటుకు తరలిస్తున్నారు. ఓవర్‌లోడ్‌తో వడ్లను లారీలలో తరలిస్తున్న క్రమంలో అనేక సార్లు ధాన్యంతో కూడిన బస్తాలు రోడ్డుపైనే పడటంతో వెనుక వస్తున్న వాహనదారులు ప్రమదాలకు గురవుతున్నారు.
అదే విధంగా గద్వాల పట్టణంలోని ఆర్‌ఓబి మీదుగా లారీల ద్వారా వరి ధాన్యంను సామర్ధ్యానికి మించి ఒక చోట నుంచి మరో చోటకు తరలిస్తున్న క్రమంలో గద్వాల్ ఆర్‌ఓబీ పైన లారీల మీద నుంచి వరి ధాన్యం బస్తాలు కిందపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆ సమయంలో వాహనదారులు ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇలా ఓవర్ లోడ్‌తో వెళ్లుతున్న వాహనాల నుంచి వరి ధాన్యం కాని ఇతర సరుకు కాని ద్విచక్ర వాహనదారులు మీద పడితే ప్రాణ నష్టం కూడా జరగవచ్చని ప్రజలు వాపోతున్నారు. ఓవర్‌లోడ్ తో సరుకు రవాణ చేస్తున్న వాహనాలపై జిల్లా ఆర్టీఏ అధికారులు కాని పోలీసులు కాని ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.