Sunday, December 22, 2024

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో సిరుల తల్లి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం అమ్మవారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో చర్నకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఈ ఉదార దేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగ దండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించారు.

కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల నుండి శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేస్తారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. అలాగే రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు.వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, విఎస్‌వో బాలి రెడ్డి, ఏఈవో రమేష్, ఆలయ అర్చకులు బాబు స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు సుభాష్, గణేష్ పాల్గొననున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News