Wednesday, January 22, 2025

కాంగ్రెస్, బిజెపి మిలాఖత్

- Advertisement -
- Advertisement -

Green Place of Worship Award for Yadagirigutta

మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు అన్నారు. నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి, ఒక వ్యక్తి స్వార్ధానికి జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చైతన్యంతో కూడిన తీర్పును ఇవ్వాలన్నారు. అనవసరంగా ఉపఎన్నికను తీసుకొచ్చిన బిజెపికి తగు రీతిలో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజాబలంతో గెలవలేక రాజ్యాంగ సంస్థల (ఇడి, సిబిఐ, ఐటి,)ను అడ్డం పెట్టుకొని బిజెపి శిఖండి రాజకీయాలను చేస్తుందని కెటిఆర్ నిప్పులు చెరిగారు. బిజెపిని ఒక నీతి జాతిలేని పార్టీగా అభివర్ణించారు. కేవలం డబ్బుతోనే మునుగోడులో గెలవాలని బిజెపి అనేక అడ్డదారులు తొక్కుతోందన్నారు. కోమటిరెడ్డి సోదరులు….కోవర్ట్ రాజకీయం చేస్తున్నారన్నారు. బిజెపి, కాంగ్రెస్‌లను కలిపేందుకు కుట్రజేస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు.
గురువారం తెలంగాణ భవన్‌లో బిజెపి నాయకులు, మాజీ శాసనసభ్యుడు బూడిద బిక్షమయ్య గౌడ్ మంత్రులు కెటిఆర్, జగదీశ్‌గౌడ్‌ల సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు. బిక్షమయ్యతో పాటు పెద్దసంఖ్యలో తరలివచ్చిన ఆయన అనుచరులకు కెటిఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడుతూ, బిజెపి ఒక దుష్ట సంస్కృతికి తెర తీసిందని విమర్శించారు. ధనబలంతో గెలిచేందుకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మోడీ సర్కార్ అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు. అయితే మునుగోడు ప్రజలు అంత అమాయకులు కారన్నారు. గతంలో జరిగిన నాగార్జున సాగర్, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారని…. ఈసారి కూడా మునుగోడులో కూడా అదే తీర్పు పునరావృతం అవుతుందన్నారు.
బిజెపి పక్షాన మోడీ…ఆయనతో బోడి వచ్చినా మునుగోడులో గెలిచేది ముమ్మాటికి టిఆర్‌ఎస్ పార్టీయేనని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని చిత్తశుద్ధితో సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నామన్నారు. ఫ్లోరైడ్ విషయంలో ఆరు దశాబ్దాలుగా కాని పనిని నాలుగేండ్లలో చేసి చూపెట్టామన్నారు. ఆడబిడ్డలకు నీటి కష్టాలు లేకుండా చేశామన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన దిశగా దండుమల్కాపూర్లో పారిశ్రామిక సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కాగా బిక్షమయ్య గౌడ్ రాకతో మరింత బలంతో ఉత్సాహంతో ముందుకు పోతామని కెటిఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసంజైలుకు వెళ్లొచ్చిన బిడ్డ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అని అన్నారు. ఆయన ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి టిఆర్‌ఎస్ పార్టీని వెన్నంటి ఉన్న నాయకుడన్నారు. అలాంటి నాయకుడిని ప్రజలు గుండెలకు హత్తుకుంటారన్న నమ్మకం తమకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు వలన ఫ్లోరోసిస్ సమస్య అంతమైందన్నారు. ఫ్లోరోసిస్ బాధిత గ్రామాలు లేవని కేంద్రమే చెప్పిందన్నారు. ఇందుకు కారణమైన మిషన్ భగీరథకు నిధులు ఇవ్వమని నీతి అయోగ్ చెబితే రూ. 18 వేల కోట్లు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిందని మండిపడ్డారు. ఫ్లోరోసిస్ సమస్య కోసం కేంద్రం కనీసం 18 రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డిది చిన్న కంపెనీ అయితే ఇంత పెద్ద కాంట్రాక్టులు ఎట్లా వస్తున్నాయో చెప్పాలని కెటిఆర్ సవాల్ విసిరారు. ఇందులో దాగిన గుజరాత్ గూడుపుఠాని ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. కర్నాటక, గుజరాత్‌లో మూడువేల వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనిది తెలంగాణలో ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు.

దేశం సర్వనాశనం
మోడీ పాలనలో దేశం పూర్తిగా సర్వనాశనం అవుతోందని కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యధిక నిరుద్యోగం, ప్రపంచంలోనే అత్యధికంగా గ్యాస్ సిలిండర్ ధర, గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో అత్యంత కింది స్థానానికి దేశాన్ని పడేసిన ఘనత మన మోడీకే దక్కిందని విమర్శించారు. ఆయనకు పాలన కంటే రాష్ట్రాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్న అంశంపైనే అధిక దృష్టి సారిస్తున్నారన్నారు. దీనిని కెసిఆర్ ధైర్యంగా ఎదుర్కొంటున్న కారణంగానే ఇడి, సిబిఐ, ఐటి సంస్థలను రంగంలోకి దించుతున్నారన్నారు. ఇలాంటి వాటికి కల్వకుంట్ల కుటుంబం బెదిరేదిలేదన్నారు. దేశ చరిత్రలో తొలిసారి చేనేతపై పన్నువేసి చేనేతలకు మరణ శాసనం రాసిన పాపం మోడీదేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి బిజెపి నుంచి రావాలని ఒక చేనేత సొదరున్ని అడిగినా తప్పా? అని ఆయన అడిగారు. మరోవైపు చేనేతలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న భీమా వంటి కార్యక్రమాలను వివరించి ఓట్లు అడిగినా అందులో ఏమైనా తప్పుందా? కెటిఆర్ ప్రశ్నించారు. అవసరమైతే రైతు బంధువు తీసుకుంటున్న కోమటిరెడ్డి సోదరులను కూడా టిఆర్‌ఎస్‌కే ఓటు వేయమని అడుగుతానని అన్నారు.

కెసిఆర్‌ను విమర్శించే అర్హత కిషన్‌రెడ్డికి లేదు
సిఎం కెసిఆర్‌ను విమర్శించే అర్హత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఆయన ఒక నిస్సహాయ మంత్రి అని మండిపడ్డారు. కెసిఆర్ ను తిట్టినంత మాత్రాన బిజెపికి ఓట్లు పడవన్నారు.ప్రజలకు మంచి పనులు చేస్తే, వాటిని చెబితే ఓట్లు వేస్తారన్న విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తుపెట్టుకోవాలని కెటిఆర్ సూచించారు. ధైర్యంగా కరోనా వ్యాక్సిని కనిపెట్టిన ప్రధాని అన్న అమాయకుడు కిషన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాలేశ్వరం ప్రాజెక్టు కట్టింది కెసిఆర్ అయితే…కిషన్ రెడ్డి సీతాఫల్‌మండిలో నాలుగు లిఫ్టులను కేంద్రం నుంచి తెచ్చారని తనదైన శైలిలో ఆయనపై వ్యంగ్యస్త్రాలను సంధించారు. కిషన్ రెడ్డికి కనీసం రాసిచ్చిన స్క్రిప్ట్ కూడా చదివే తెలివి కూడా లేదన్నారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణకి ఏం తెచ్చారో ప్రజలకు చెప్పి మునుగోడులో ఓటు అడగాలని డిమాండ్ చేశారు. 2016లో నడ్డా అనే అడ్డమైనోడు మర్రిగూడలో పెడతామన్న కరోనా రీసెర్చ్ సెంటర్‌తో పాటు హాస్పిటల్స్ సంగతి ఏమైందో చెప్పాలన్నారు.

రాజ్యాంగ సంస్థలన్నీ కీలు బొమ్మలుగా మారాయి
దేశంలోని రాజ్యాంగ సంస్థలన్నీ ప్రస్తుతం కీలు బొమ్మలుగా మారాయని కెటిఆర్ ఆరోపించారు. మరమనషులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర సర్కార్ చెప్పినట్లుగా నడుచుకుండా రాజ్యాంగ విలువలను దిగజార్చుతున్నాయని ధ్వజమెత్తారు. ఇవన్నీ కూడా బిజెపికి అనుబంధ సంఘాలుగా పేర్లు మార్చుకుంటే మంచిగా ఉంటుందని సూచించారు.

వాళ్లు కోవర్ట్ బ్రదర్స్
కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు… వాళ్ళు కోవర్ట్ బ్రదర్స్ అని కెటిఆర్ మండిపడ్డారు. డబ్బులతోనే రాజకీయం చేయొచ్చని నలగొండ రాజకీయాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఒకాయన కాంగ్రెస్‌లో ఉండి బిజెపికి పని చేస్తారు… ఇంకొక ఆయన 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసం పార్టీ మారాడని ధ్వజమెత్తారు. బడుగు, బలహీన వర్గాలను రాజకీయంగా అంతం చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌కి నల్గొండ జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ప్రస్తుతం రూ.18వేల కోట్ల కోసం మునుగోడు ఆమ్ముకున్నారని… మళ్ళీ గెలిస్తే లక్ష కోట్లకు నల్గొండను అమ్ముకుంటారన్నారు. దేశం కోసం ధర్మం కోసం అనే బిజెపి, ఒక బ్రోకర్ ను, రాజకీయ కాంట్రాక్టర్ ను ఎందుకు పార్టీలో చేర్చుకుందని ప్రశ్నించారు.

ఆయన గ్రహచారం బాగాలేదు..
రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలుంటాయన్న సామెతను బూర నర్సయ్యగౌడ్ నిజం చేస్తున్నారని కెటిఆర్ అన్నారు. ఆయన గ్రహచారం బాగాలేదని, అందుకే పార్టీ మారారని వ్యాఖ్యానించారు. బూర తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ సమాధిగా మారనుందన్నారు. టిఆర్‌ఎస్‌లో ఉన్నంత గుర్తింపు ఆయనకు బిజెపిలో దక్కదన్నారు. ఆయన దురదృష్టానికి తాము బాధ్యులం కామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Munugode Bypoll: KTR Slams BJP and Congress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News