Wednesday, January 22, 2025

కృష్ణాపై ఎపిలో మరో ఎత్తిపోతల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కృష్ణానది పరివాహకంగా మరో ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వరిశెలపూడి ఎత్తిపోతల పథకం పేరుతో చేపట్టిన ఈ పధకం వల్ల నాగార్జున సాగర్ రిజర్వాయర్‌పై నీటివత్తిడి మరింత పెరగనుంది. ఒక వైపు ఇప్పటికే కృష్ణానదీ పరివాహకంగా ఉన్న ప్రాజెక్టులకు నీరందక ఏటా లక్షలాది ఎకరాల ఆయకట్టు బీళ్లుగా మారుతోంది. ఇటు శ్రీశైలం అటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టుకు చాలినంత నీరందటం లేదు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా వేరుపడ్డాక కృష్ణానదీజలాల్లో నీటివాటాల పంపిణీ సమస్య జఠిలంగా మారింది. ఉమ్మడి ఏపిలో ఎంతో నష్టపోయిన తెలంగాణకు ఇప్పటికైనా కృష్ణానదీజలాల్లో న్యాయం జరగాలని తెలంగాణ రాష్ట్రం నినదిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ నీటిపంపిణీని తిరిగి సమీక్షించాలని కోరుతోంది. ఈ సమస్యను సాధ్యమైనతంత వేగంగా పరిష్కరించేందుకు కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతోంది. కేంద్రప్రభుత్వం కూడా న్యాయసమ్మతమైన తెలంగాణ వాదన పట్ల మొగ్గుచూపుతోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువరించింది.

మరో వైపు ఉన్నత న్యాయస్థానాల్లో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణానదీజలాల సమస్యపై వ్యాజ్యాలు ..వాటికి సంబంధించిన వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసేలా వరిసెలపూడి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది.ఏపిలో పల్నాడు ప్రాంతానికి ప్రయజనం చేకూర్చే విధంగా “వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం” కింద..రూ.340 కోట్ల ప్రాధమిక అంచనా వ్యయంతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి బుధవారం నాడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మాచర్లలో పనులకు శ్రీకారం చుట్టారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి ఏడు టిఎంసీలకు పైగా కృష్ణానదీజలాలను ఎత్తిపోసి 75000 ఎకరాలకు సాగు నీరు ,మాచర్ల ,వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధలో 4.5లక్షల జనాభాకు తాగునీరు అందించాలన్నది లక్షంగా వరిశెలపూడి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలిదశ కింద రూ.340 కోట్ల వ్యయంతో వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు,

గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించే పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ వరికపూడిశెల పథకానికి డిపిఆర్ రూపొందించారు.నాగార్జున సాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరా చేస్తూ మొత్తం 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 7 గ్రామాల్లోని 24,900 ఎకరాలకు సాగు నీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించాలని లక్షంగా పెట్టుకున్నారు.ఇప్పటికే అటవీ ప్రాంతంలో పంప్ హౌస్ నిర్మాణానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్ లైఫ్, అటవీ, పర్యావరణ శాఖల నుండి కీలకమైన అనుమతులు కూడా తెచ్చుకున్నారు. వరికపూడిశెల ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నది జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చనున్నట్లు సిఎం జగన్ వెల్లడించారు. వరికపూడిశెల పథకానికి ఈ ఏడాది మే 19న వన్యప్రాణి సంరక్షణ అనుమతులు-,ఈ నెల 6న అటవీ పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నారు. కృష్ణానదీయాజమాన్య బోర్డుకు కూడా ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా బుధవారం మాచర్లలో వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News