ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం నాడు ఢిల్లీలో తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటిన నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్. చిత్రంలో ఎంపి సంతోష్‌కుమార్ తదితరులు.
ప్రతి గ్రామాన హరిత ఉద్యమ ఆవశ్యకత, రాష్ట్రంలో పచ్చదనం కోసం చేస్తున్న కృషి అభినందనీయం
ముఖ్యమంత్రిపై నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ ప్రశంసలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యావరణ ప్రేమికుడని, పచ్చదనం కోసం మహా హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టారని నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ ప్రశంసించారు. ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతిబాగ్‌లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ చేపట్టిన మహా హరిత ఉద్యమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అరుదైన మొక్కలతో పాటు స్థానిక మొక్కలను నాటుతూ ముందుకు సాగితే తప్పకుండా పర్యావరణ మార్పులపై విజయం సాధించగలమన్నారు. త్వరలోనే మరో ముగ్గురిని ఈ హరిత సవాల్ కి నామినేట్ చేస్తానని చెప్పారు.