Monday, January 20, 2025

నిరుద్యోగుల మెరుపు నిరసన

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు డిఎస్‌సి, గ్రూప్-1 అభ్యర్థులు పరీక్షల నిర్వహణ మార్పులు తమ గళం వినిపించగా, తాజాగా గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని కొందరు నిరుద్యోగులు హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలోనే చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఆర్‌టిసి క్రాస్ రోడ్డులో భైఠాయించి మెరుపు నిరసన తెలియజేశారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో ఓ నిరుద్యోగి సొమ్మసిల్లి పడిపోయాడు. అభ్యర్థుల ఆందోళనతో ఆర్‌టిసి క్రాస్ రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యో గులు గ్రూప్ 2 లేదా గ్రూప్ 1కు మాత్రమే సిద్ధం కావాల్సి వస్తుందని, ఒక పరీక్ష కోల్పోవటం జరుగుతుందని వాపోయారు. గ్రూప్ 2, గ్రూప్ 3 షెడ్యూల్ ఒకే సమయానికి ఉండటం వల్ల అలాగే ఈ రెండింటి పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు.

గ్రూప్ 2 డిసెంబర్‌లో నిర్వహిస్తే గ్రూప్ 1 మెయిన్స్‌కు ప్రిపరేషన్‌కు టైమ్ ఉంటుందన్నారు. ఈ ధర్నాకు భారీస్థాయిలో నిరుద్యోగులు హాజరై తమ నిరసనను తెలిపారు. డిఎస్సీ, గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయడం కుదరని, షెడ్యూల్ ప్రకారం యధావిధిగా పరీక్షలు జరుగుతాయని సిఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు, డిఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని మరోసారి డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో పెట్టుకోకుండా తమ సమస్యలు వెంటనే పరిష్కారించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగుల ఆందోళనతో అశోక్ నగర్‌లో వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి నిరుద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది.

ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. తమ వెనుకాల ఏ రాజకీయ పార్టీ లేదని స్పష్టం చేశారు. కావాలని కొందరు సీఎం రేవంత్ రెడ్డికి తప్పుడు సమాచారం అందిస్తున్నారని పేర్కొన్నారు. గ్రూప్ -1 మెయిన్స్‌కు 1:100 పిల్వాలని, దాంతో పాటు గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంచాలని, డిఎస్‌సిని మూడు నెలల పాటు వాయిదా వేసి 25 వేల పోస్టులతో మెగా డిఎస్‌సి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News