Friday, November 22, 2024

చీమలపాడు ప్రమాద బాధితులకు కెటిఆర్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్, ఎంపిలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి గురువారం మంత్రి కెటిఆర్ నిమ్స్‌లో చికిత్సలో పొందుతున్న బాధితులను పరామర్శించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు మంత్రి కెటిఆర్‌కు తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, చీమలపాడు ఘటన దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందో.. లేదో దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైదులను కోరినట్లు తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు తాము అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఈ నెల 12న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న సభా ప్రాంగణానికి కొద్ది దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనపై సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కు, చీమలపాడులో ఉన్న ఎంపి నామా నాగేశ్వర్‌రావుకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, అండగా ఉంటామని సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. దీంతోపాటు నామా ముత్తయ్య ట్రస్ట్ ద్వారా మృతుల కుటుంబాలకు మరో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఎంపి నామా నాగేశ్వరరావు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సాయం అందిస్తానని ఎంఎల్‌ఎ రాములునాయక్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News