జగిత్యాల: జిల్లాలో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్ననేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కురుస్తున్న భారీ వర్షాలతో ధర్మపురిలో గోదావరి నది ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో నదులకు వరద పోటెత్తితుందని, నదులు వాగులు, వంకలు పొంగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాయికల్ మండలంలోని బోర్నపల్లి గ్రామం వద్ద కుర్ర వాగు సమీపంలో ఐలాండ్ వద్ద చిక్కుకున్న 9 మంది వ్యవసాయ కూలీలను ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా రక్షించామని, న్యూస్ కవరేజ్ లో భాగంగా ఎన్టీవి రిపోర్టర్ మిస్ కావడం చాలా బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా 80% పైగా చెరువులు నిండుకున్నాయని, ప్రాజెక్టులు నిండుకున్న నేపథ్యంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని, ప్రాజెక్టు పరివాహక ప్రాంత పరిధిలో గ్రామ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రత్యేక పూర్తి స్థాయిలో సహకరించాలని మంత్రి కోరారు. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి భారీ స్థాయిలో నీటి విడుదల జరుగుతుందని.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రాణ నష్టం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని మంత్రి అన్నారు.
Koppula Eshwar inspects flooded areas of Godavari River