Monday, December 23, 2024

డింపుల్ వర్సెస్ డిసిపి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సినీనటి డింపుల్ హయతి, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే మధ్య వివాదం మరింత ముదిరింది. ఇద్దరి మధ్య కారు పార్కింగ్ విషయంలో వచ్చిన వివాదం డిసిపి డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు వరకు వెళ్లింది. కారుపై డింపుల్ దాడి చేసిందని డిసిపి డ్రైవర్ చేతన్ పోలీసులకు ఈ నెల 14న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. డింపుల్‌పై 353,341,279 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే నగర ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో సినీ నటి డింపుల్ హయతి తన స్నేహితుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి ఉంటోంది. కొద్దిరోజులుగా సెల్లార్‌లోని పార్కింగ్ ప్లేస్ విషయంలో డింపుల్ హయతికి, డీసీపీ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎం.చేతన్ మధ్య వివాదం కొనసాగుతోంది.

డింపుల్ హయతి, విక్టర్ డేవిడ్ తమ బీఎండబ్ల్యూ కారును డీసీపీ వాహనానికి అడ్డుగాపెట్టడంతో డీసీపీ కారు డ్రైవర్‌తో వారితో వాగ్వాదానికి దిగుతుండేవారు. తమ కారును తీసేందుకు వీలుగా కారు పార్క్ చేయాలని చెప్పినా డింపుల్, విక్టర్‌కు పలుమార్లు చెప్పినా వినిపించుకోకుండా పలుమార్లు అడ్డంకులు సృష్టించారు. ఈ క్రమంలోనే ఈ నెల 14న అపార్ట్‌మెంట్‌లోని సెల్లార్‌లో పార్క్ చేసిన డీసీపీ వాహనాన్ని తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి డింపుల్ హయతి ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా డీసీపీ కారుకు ఇతర వాహనాలు తగలకుండా పెట్టిన కోన్స్‌ను కాలితో తన్నేసి వీరంగం సృష్టించింది. ఇదేంటని కానిస్టేబుల్ చేతన్ ప్రశ్నించడంతో అతనితో గొడవకు దిగింది. దీంతో డీసీపీ డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు డింపుల్ హయతితో పాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం సీఆర్‌పీసీ 41(ఏ) కింద నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే డింపుల్ హయతి, విక్టర్ డేవిడ్‌ను సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తప్పును కప్పిపుచ్చలేరు డింపుల్ హయతి ట్వీట్
జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు కావడంతో డింపుల్ హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య వివాదం బయటకొచ్చింది. రాహుల్ హెగ్డే కారుపై డింపుల్ హయతి దాడి చేయడానికి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు బయటకొచ్చినప్పటికీ.. తనవైపు ఏ తప్పులేదని వాదిస్తోంది. ఈ క్రమంలోనే డీసీపీని ఉద్దేశించి డింపుల్ హయతి ఓ ట్వీట్ చేసింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పును కప్పిపుచ్చుకోలేరంటూ అందులో పేర్కొంది. అంతటితో ఆగకుండా ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తానని డింపుల్ అంటోంది. గన్‌మెన్లను పెట్టుకుని ఉన్న అంతపెద్ద ఆఫీసర్‌ణు నేనేం చేస్తానని డింపుల్ అన్నారు. కేసు కోర్టు వరకు వెళ్లాక అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు.

నాపై తప్పుడు కేసు పెట్టారని, డిసిపిని ఎప్పుడు ఇబ్బందిపెట్టలేదని అన్నారు. పబ్లిక్ ప్రాపర్టీని తీసుకొచ్చి ప్రైవేట్ ప్రాపర్టీలో పెట్టారని, ట్రాఫిక్ కోన్స్‌ను ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఎలా పెడతారని తెలిపారు. డింపుల్ కారుకు అడ్డంగా డీసీపీ డ్రైవర్ సిమెంట్ ఇటుకలు పెట్టేవాడని, అందువల్ల ఆమె తన వాహనాన్ని బయటకు తీసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేదని, ఈ విషయం డీసీపీకి తెలియకపోవచ్చని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. డింపుల్‌పై కావాలనే తప్పుడు కేసు పెట్టారని.. దీనిపై లీగల్‌గా ఫైట్ చేస్తామని ఆమె తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.

డింపుల్‌తో వ్యక్తిగత గొడవలు లేవుః రాహుల్ హెగ్డే, ట్రాఫిక్ డిసిపి
డింపుల్ హయతితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పష్టం చేశారు. కొద్దిరోజులుగా డింపుల్ హయతినే తన వాహనానికి అడ్డుగా కారు పెడుతోందని తెలిపారు. పోలీసు అధికారిని కాబట్టి అత్యవసరంగా వెళ్లాల్సి ఉంటుందని.. అలాంటి సమయంలో డింపుల్ తన కారు అడ్డుగా పెట్టి ఇబ్బంది పెడుతోందని అన్నారు. తాజాగా తన వాహనాన్ని ఢీకొట్టి కాలితో తన్నిందని తెలిపారు. ఇలా చాలాసార్లు జరిగిందని ఆయన తెలిపారు. ఆ సమయంలో తాను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేశానని, అయినా ఆమె తీరు మారలేదని చెప్పారు. దీంతో తన డ్రైవర్ చేతన్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. డింపుల్‌తో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి వివాదాలు లేవని, ఆమె చేసిన ఆరోపణల వెనుక నిజాలు పోలీసుల విచారణలో బయటపడతాయని తెలిపారు.

డింపుల్ హయతి కారుపై రూ.3వేలకు పైగా చలాన్లు
ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని ఢీకొట్టిన కారు డింపుల్ హయతి స్నేహితుడైన విక్టర్ డేవిడ్ పేరు మీద ఉంది. డేంజరస్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ పార్కింగ్.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించడంతో ఆ కారుపై ఇప్పటికే పలు చలాన్లు ఉన్నాయి. గత వారం రోజుల్లోనే ఆ కారుపై రూ.3వేలకు పైగా జరిమానాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News