Sunday, November 17, 2024

ఢిల్లీలో అమానుషం.. కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొని హత్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారు జామున మరోసారి హిట్ అండ్ రన్ సంఘటన జరిగింది. నంగ్లోయ్ ప్రాంతంలో స్పీడుగా వెళ్తున్న కారును ఆపడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను చాలా దూరం ఈడ్చుకెళ్లి ప్రాణాలు కోల్పోయేలా చేసిన దారుణ సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మృతుడు సందీప్…నంగ్లోయ్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. పోలీస్‌లు అందించిన సమాచారం ప్రకారం సందీప్ ఆ సమయంలో సాదా దుస్తుల్లో ఉన్నాడు. ఆ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువయ్యాయని తెలిసి గస్తీలో మామూలు దుస్తుల్లో ఉన్నట్టు తెలిసింది. ఆయన తన బైక్‌పై ఉండగా , ఒక వాగన్‌ఆర్ వాహనం నిర్లక్ష్యంగా దూసుకుంటూ వెళ్లడం గమనించాడు.

అకస్మాత్తుగా ఆ వాహనం ఓవర్‌టేక్ చేస్తూ సందీప్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. పార్కు చేసి ఉన్న మరో కారును ఢీకొట్టి దాదాపు పది మీటర్ల దూరం సందీప్‌ను ఈడ్చుకుంటూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సందీప్‌ను సోనియా ఆస్పత్రికి, తరువాత పశ్చిమవిహార్‌లోని బాలాజీ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో సందీప్ చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఈ ప్రమాదంపై మీడియా ప్రతినిధులతో డిసిపి జిమ్మీ చిరమ్ మాట్లాడుతూ ప్రమాద స్థలం నుంచి పరారైన ఇద్దరు నిందితులను పోలీస్ బృందాలు తరువాత అరెస్ట్ చేసి, కారును స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. ఈ కేసు రోడ్ రేజ్ కిందకు వస్తుందని, దర్యాప్తు సాగుతోందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News