Sunday, January 19, 2025

తెలంగాణ దారి దీపాలు

- Advertisement -
- Advertisement -

ఒక ప్రాంతం గాని, ఒక వ్యవస్థ గాని, ఒక మనిషి గానీ అభివృద్ధి చెందాయి అంటే దాని వెనుక విశేషమైన కృషి అంకిత భావం పుష్కలంగా ఉంటాయి, ఒక తరం దాని ముందు తరం నుంచి అందుకున్న స్ఫూర్తిని పాతతరం కొత్త తరానికి పంచిన వారసత్వ సంపదగా స్వీకరించి దాని సాయంగానే ఆధునిక తరాలు అనుకున్న అభివృద్ధి బాటలో పయనించగలవు.
నేడు మనం అనుభవిస్తున్న హక్కులు సౌకర్యాలు వెనుక అనేక పోరాటాలు త్యాగాలు ఉన్నాయన్న సోయి మనకు ఉన్న నాడే మనలో కృతజ్ఞతా భావం పొడచూపి మన జీవన విధానములో గణనీయమైన మార్పులు వచ్చి చేరతాయి.
నేటితరం ‘యాంత్రిక జీవన యువతకు‘ మన గతకాల కృషి అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా జరిగిన తీరు తెలపడం ద్వారా భావితరాల తెలంగాణ జనతలో సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే ఉన్నత లక్ష్యం తో ప్రచురించిందే ఈ ‘తెలంగాణ దారి దీపాలు‘ ఉద్గ్రంధం.
నాడు సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచిక ద్వారా 354 మంది తెలంగాణ కవుల కవిత్వాన్ని వెలికి తీసినట్టు గానే నేడు డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి సుమారు 336 మంది తెలంగాణ తేజోమూర్తుల ప్రతిభా విశేషాలను కొండ అర్థమందు అన్న విధంగా అందించారు. 740 పుటల ఈ గ్రంథం నిండా తెలంగాణ ప్రాంతానికి చెందిన చరిత్ర కెక్కని చరితార్థులు, మరుగున పడిన సాహితీ మాణిక్యాలు కనిపిస్తాయి,
తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో గల తేజోమూర్తుల జీవిత విశేషాలను ఆయా ప్రాంతాలకు చెందిన రచయితల ద్వారా వ్రాయించడం వల్ల ఈ గ్రంథ రచనలో మరింత స్పష్టత ప్రామాణికత చేకూరాయి.
ఆదిలాబాద్ మొదలుకొని హైదరాబాదు/ రంగారెడ్డి జిల్లాల వారీగా సాగిన ఈ దారి దీపాల వెలుగుల ప్రయాణంలో ఎన్నో విశేషాలు, మరెన్నో ఆదర్శనీయ సంగతులు. సవిచూడవచ్చు.
‘తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి‘ పక్షాన ప్రచురించబడ్డ ఈ అమూల్య గ్రంథంలో మొదట సంస్థ చేసిన కార్యక్రమాలు, ప్రచురణలు, వివరాలు పొందుపరచడం జరిగింది దీని ద్వారా సంస్థ చేస్తున్న సాహితీ యజ్ఞం కళ్ళకు కట్టినట్టు అయింది.
డా: నందిని సిధారెడ్డి, డా: అమ్మంగి వేణుగోపాల్, డా: ముదిగంటి సుజాతారెడ్డి, గార్ల ముందు మాటలు ఈ గ్రంథానికి ముచ్చటైన అక్షరదారులు వేసాయి.
ఈ బహుళ ప్రయోజన కారి అయిన గ్రంథంలో తత్వవేత్తలు, శిల్పులు, పోరాట యోధులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, సాహితీ మూర్తులు, ఇలా అనేక రంగాలకు చెంది బాహ్య ప్రపంచానికి అంతగా పరిచయం కానీ తెలంగాణ తేజోమూర్తులు వివరాలు క్షుణ్ణంగా సంక్షిప్తంగా చెప్పడంలో రచయితలు చెప్పించడంలో సంపాదకవర్గం సఫలీకృతులయ్యారు.
ఆదిలాబాద్ అనగానే సామల సదాశివ, చిందు ఎల్లమ్మలు, ముందుగా గుర్తుకొస్తారు కానీ అక్కడే జన్మించిన గొప్పతత్వవేత్త ఉదారి నాగదాసు, దళిత జాతికి చెందిన కవితా అగ్నికణం కరాడిభూమన్న, గొప్ప శిల్పి రవీంద్ర శర్మ, సామాజిక చింతనాపరుడు పరమేశ్వరయ్య, తండ్రివాద్య కళాకారుడు తుమ్మపురి రామస్వామి, వంటి వారి గురించి నేటి తరానికి అంతగా తెలియదు ఇటువంటి వారి గురించిన ఆసక్తికర సమాచారం ఇందులో పొందుపరచబడింది,
ఇది మచ్చుకు మాత్రమే.!!
సాహితీ సాంస్కృతిక కేంద్రమైన కరీంనగర్ కు చెందిన ప్రముఖ చిత్రకారుడు పి.టి.రెడ్డిగా ప్రాచుర్యం పొందిన పాకాల తిరుమలరెడ్డి జీవిత విశేషాలు కూడా మనం గమనించవచ్చు,
జనగామ కు చెందిన దొడ్డి కొమరయ్య చుక్కా సత్తయ్యల వీరగాథలతోపాటు, ఖమ్మంకు చెందిన తొలి తెలుగు సినీగేయ రచయిత చందాల కేశవదాసు కు చెందిన అపూర్వ సాహితీ, నాటక రంగ సేవలు ఇందులో చదవవచ్చు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ముద్దు రామకృష్ణయ్య, ములుగు జిల్లాకు చెందిన ఆలం లక్ష్మయ్య,లు ఆనాటి అసౌకర్యాల నడుమ తమకు తాము కష్టపడి ఒకరు విదేశాలకు మరొకరు ఢిల్లీ వరకు వెళ్లి ఉన్నత చదువులు చదివి ఉత్తమ ఉద్యోగాలు చేయడమే కాక తమ తరం విద్యార్థులకు విద్యా స్ఫూర్తిని ఎలా కలిగించారో కూలంకషంగా వివరించారు నేటితరం విద్యార్థులకు ఈ వ్యాసాలు ఎంతో ఆదర్శనీయం మరి ఎంతో స్ఫూర్తిదాయకం కూడా.
తెలంగాణ అనగానే అరకొర అక్షరజ్ఞానం, నిరంతర పోరాటాలమయం, కరువు కాటకాలతో నిండిన నిర్భాగ్యులకు నిలయం అని మనం విన్నాం, కానీ అక్కడే ఎందరో విజ్ఞాన సంపన్నులు మేధావులు వీరులు కూడా జన్మించారన్న చారిత్రక సత్యాన్ని అక్షరాల అందిస్తుంది ఈ తెలంగాణ దారితీపాలు గ్రంథం.
తెలంగాణకు చెందిన తొలి తరం శతావధాని, బహుభాషా పండితుడు, ‘నరిశెనహళ్ కృష్ణమాచార్యులు‘ సాహిత్య కృషిని చదివాక తెలంగాణ మీద గల గతకాల దురభిప్రాయం మటు మాయంఅవుతుంది,
సోమరాజు రామానుజరావు, ఒద్దిరాజు సహోదరులు, కౌమిది, అలిశెట్టి ప్రభాకర్, అందె వెంకటరాజం, నీలా జంగయ్య, కపిలవాయి లింగమూర్తి, ఇరవైఇంటి కృష్ణమూ ర్తి, వేదుల సత్యనారాయణ, గూడ అంజయ్య, దాశరధి సహోదరులు, కాళోజి, పల్లా దుర్గయ్య, బిరుదు రాజు రామరాజు, ఇల్లిందల సరస్వతి దేవి, తదితర సాహితీ మూర్తులతో పాటు కొమరంభీమ్, భాగ్యరెడ్డి వర్మ, చాకలి ఐలమ్మ ,ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణరెడ్డి, దుద్దిళ్ళ శ్రీపాదరావు, జలగం వెంగళరావు, హీరాలాల్ మోరియా, తదితర పోరాట రాజకీయ నాయకుల కృషిని స్ఫూర్తివంతంగా సరళమైన శైలిలో పఠనీయమైన బాణీలో చెప్పిన వైనం అత్యంత ఆదర్శనీయం.
చిందుకళా ప్రపూర్ణుడుగా వాసికెక్కిన కరీంనగర్ కళారత్నం గడ్డం మచ్చయ్య దాసు, పాతికేళ్ల పాటు కొండగట్టు అంజన్న దేవాలయంలో అర్చకత్వం చేసిన ధన్యజీవి. ఆయన అనేక రచనలు చేయడమే కాక వేల ఏండ్లుగా మౌఖికంగా చెప్పబడుతున్న ‘జాంబవ పురాణం‘ను ఏడాది కాలంలోనే అక్షరీకరించిన ఘనత మచ్చ య్యదాసు గారిదే. తెలంగాణలో అనేకమంది ప్రముఖులతో పాటు మరెందరో విస్మృ త కవులు కూడా ఉన్నారు. అలాంటి విస్మృత జాతి రత్నాల గురించి కేవలం పరిచయ వాక్యాలతో సరిపెట్టుకోకుండా వారి వారి జీవనస్థితిగతులు కూడా కూలంకషంగా వివరించిన తీరు ఎంతో విలువైన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది.
మార్చాల రామాచార్యులు, తెలకపల్లి రామచంద్రశాస్త్రి, నాగలింగ శివయోగి, శ్రీరామోజు విశ్వనాథ చారి, ఈగ బుచ్చి దాసు, వృక్షాల జగన్నాథం పులువు శ్రీనివాసు మామిడి మల్లారెడ్డి మొదలైన నేటి తరానికి అస్సలు తెలియని సాహితీ దిగ్గజాల గురించిన సమగ్ర విశేషాలే కాక 33 జిల్లాలకు చెందిన ప్రముఖ కీర్తి చిత్రాలను కూడా పొందుపరచడంతో మరెంతో సమాచారయుక్తంగా తీర్చిదిద్దబడింది, తెలంగాణ మహనీయుల తరగని గని వంటి ఈ అమూల్య గ్రంథం తెలంగాణ జాతి జనులంతా తప్పక చదివి తీరాలి, అలాగే తెలంగాణ సాహిత్య సాంస్కృతి విశేషాల గురించిన పరిశోధకులు దీనిని విధిగా చదివి తీరాలి, నేటి కాలంలో వెలువడ్డ ఒక గొప్ప గ్రంధంగా దీనిని చెప్పవచ్చు.

-డా. అమ్మిన శ్రీనివాస రాజు, 7729883223.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News