Friday, December 20, 2024

తెలంగాణ సాధించినట్లే దేశంలో మార్పు తెస్తాం: కవిత

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సాధించినట్లే దేశంలో మార్పు తెస్తాం
ప్రజాస్వామ్య ఖూనీ రాజకీయాలను ఎదుర్కోవడం కెసిఆర్‌కే సాధ్యం:ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత
తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా బాద్యతలు స్వీకరించిన రాజీవ్ సాగర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను సాధించినట్లే దేశంలోనూ మార్పు తీసుకురావడం ముఖ్యమంత్రి కెసిఆర్ తోనే సాధ్యమని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడే రాజీవ్ సాగర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ.. కష్టపడి పని చేసేవారికి తగిన గుర్తింపు తప్పకుండా వస్తుందని, అందుకు రాజీవ్ ప్రత్యక్ష ఉదహరణ అని అన్నారు. రాజీవ్ సాగర్‌కు వచ్చిన గుర్తింపు జాగృతి కార్యకర్తలకు, తెలంగాణ ఉద్యమంలో స్వచ్చందంగా పాల్గొన్న యువ మిత్రులకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం, మన ప్రాంతం కోసం ఉద్యమం చేశామని కవిత గుర్తు చేశారు. గత ఎనిమిదేళ్ళలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పై కొంత మంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఉద్యమ సమయంలో ఈ మాటలు మాట్లాడేవారు ఎక్కడ ఉన్నారో మనకు తెలుసన్నారు. నెత్తిమీద రూపాయి పెడితే అర్థరూపాయికి కూడా వాళ్ళని కొనరని ఎద్దేవా చేశారు. అలాంటి వారు కూడా కెసిఆర్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మనమందరం సైద్దాకంతికపరమైన రాజకీయాలు చేయాలని ఓట్ల రాజకీయాలు కాదన్నారు. దేశంలో ప్రస్తుతం కొన్ని పార్టీలు ప్రుజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని, అలాంటి వారిని ఎదుర్కోవడం కెసిఆర్‌తోనే సాధ్యమని కవిత అన్నారు. ఇక ముందు కూడా ఇలాగే కష్టపడి పనిచేయాలని, దేశంలో మన పాత్ర కీలకంగా ఉండాలని పిలుపునిచ్చారు. మనమంతా కెసిఆర్ వెంట నడవాలని కోరారు. పనిచేసే కార్యకర్తలు సమయం కోసం వేచి చూడాలని తప్పకుండా అందరికి గుర్తింపు లభిస్తుందని కవిత చెప్పారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కెసిఆర్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి అంగన్‌వాడి కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అంగన్‌వాడి కేంద్రాల ద్వారా 4.72లక్షల మంది మహిళలు, బాలింతలు లబ్దిపొందుతున్నారన్నారు. ఆరేళ్ళలోపు వయస్సున్న 17.63లక్షల మంది చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు.

MLC Kavitha speech after Rajiv Sagar Oath as Food Chairman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News