Thursday, January 23, 2025

నేడు హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం హెచ్‌సిఎ ఎన్నికలు జరుగనున్నాయి. సుప్రీం కోర్టు నియమించిన ఏక సభ్య కమిటీ జస్టిస్ నాగేశ్వర రావు పర్యవేక్షణలో ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వి.ఎస్. సంపత్ కుమార్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈసారి నాలుగు ప్యానెల్‌లు ఎన్నికల బరిలో నిలిచాయి. అధికార పార్టీ బిఆర్‌ఎస్ బలపరుస్తున్న అర్శనపల్లి జగన్‌మోహన్ ప్యానెల్‌తో సహా మరో మూడు ప్యానెల్‌లు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈసారి ఎన్నికల్లో జగన్‌మోహన్ రావు ప్యానెల్, హెచ్‌సిఎ మాజీ అధ్యక్షులు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్‌లు బలపరుస్తున్న ప్యానెల్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇరు పక్షాలు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నాయి. హెచ్‌సిఎలో మొత్తం 173 ఓట్లు ఉన్నాయి. వివిధ క్రికెట్ క్లబ్‌లతో పాటు ఇనిస్టిట్యూషన్స్, జిల్లాలకు చెందిన క్రికెట్ సంఘాలు, అంతర్జాతీయ క్రికెటర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నాయి.

జగన్ ప్యానెల్ ముందంజ..
ఈ ఎన్నికల్లో నాలుగు ప్యానెల్‌లు బరిలో నిలిచాయి. బిఆర్‌ఎస్ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఆర్శనపల్లి జగన్‌మోహన్ రావు ప్యానెల్‌కు గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మంత్రులు కెటి రామారావు, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌సి కవితతో సహా ఇతర ప్రముఖులు జగన్ ప్యానెల్ గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇక ఓటింగ్‌లో పాల్గొంటున్న మెజారిటీ క్లబ్‌లు, ఇన్‌స్టిట్యూషన్స్, జిల్లాలకు చెందిన క్రికెట్ సంఘాలు జగన్ ప్యానెల్‌కు మద్దతుగా ఉన్నాయి. దీంతో హెచ్‌సిఎ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జగన్‌మోహన్ రావుతో పాటు ఆయన ప్యానెల్ సభ్యులు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. విజయానికి కావాల్సిన 87 ఓట్లను మించి జగన్‌మోహన్ రావు సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మరోవైపు భారత హ్యాండ్‌బాల్ సంఘంలో నెలకొన్న విభేదాలను సమర్థంగా రూపుమాపి ఆ సంఘాన్ని గాడిలో పెట్టిన ఘనత జగన్‌మోహన్ రావుకు దక్కుతోంది. దీంతో ఆయనను ఎలాగైన గెలిపించాలని హెచ్‌సిఎ ఓటర్లు భావిస్తున్నారు. జగన్‌మోహన్ ప్యానెల్ తరఫున పి.శ్రీధర్, హరినారాయణ రావు, నోయల్ డేవిడ్, శ్రీనివాస రావు, అన్సార్ అహ్మద్ ఖాన్‌లు వివిధ పదవుల కోసం పోటీ పడుతున్నారు.

గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
మరోవైపు ఎన్నికల్లో గెలుపుపై నాలుగు ప్యానెల్‌లు కూడా ధీమాతో ఉన్నాయి. ఆరు పదవుల కోసం శుక్రవారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్ పదవుల కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి జగన్‌మోహన్ రావుతో పాటు అమర్‌నాథ్, డాక్టర్.కె.అనిల్ కుమార్, పి.ఎల్.శ్రీనివాస్ తలపడుతున్నారు. ఉపాధ్యక్ష పదవి రేసులో సి.బాబురావు, శ్రీనివాస రావు, పి.శ్రీధర్, సర్దార్ దల్జీత్ సింగ్, ప్రధాన కార్యదర్శి కోసం ఆర్.దేవ్‌రాజ్, డాక్టర్ హరినారాయణరావు, భాస్కర్, ఆగమ్ రావు, సంయుక్త కార్యదర్శి పదవి కోసం చిట్టి శ్రీధర్, నోయల్ డేవిడ్, సతీష్‌చంద్ర, బసవరాజు, కోశాధికారి కోసం సి.జె.శ్రీనివాస రావు, సంజీవ్ రెడ్డి, గెరార్డ్‌కర్, మహేంద్ర, కౌన్సిలర్ కోసం వాల్టర్, డాక్టర్ అన్సార్ అహ్మద్ ఖాన్, సునీల్ కుమార్, వినోద్ కుమార్‌లు బరిలోకి దిగారు. శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం ఆరు గంటల లోపు ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News