మన తెలంగాణ/హైదరాబాద్: రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌డిసిఎల్)కు రూ.2410 కోట్లకు పరిపాలన అనుమతులిస్తూ జిఓ నెంబర్ 510ను పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ జారీ చేశారు. జిహెచ్‌ఎంసితో పాటు నగర పరిసరాల్లోని 10 మున్సిపాలిటీల పరిధిలోని 104 కారిడార్స్‌లను కలుపు తూ రోడ్ల అనుసంధానం, బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఈ పరిపాలన అనుమతులు ఇచ్చినట్టు ఆయన ఆ జిఓలో పేర్కొన్నారు. ఈ 104 కారిడార్స్‌లో ముఖ్యమైన 50 కారిడార్లను 5 ప్యాకేజీలుగా విభజించి సుమారు రూ.1500 కోట్లతో మొదటి విడతగా పనులను చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
మొదటి ప్రాధాన్యతలో భాగంగా
మొదటి ప్రాధాన్యతలో భాగంగా రూ.1500 కోట్లతో ఈ అభివృద్ధి పనులను చేపట్టనున్నట్టు ఆయన ఆ జిఓలో తెలిపారు. మొదటి ప్యాకే జీ 1 కింద 25.20 కిలోమీటర్లు, రూ.304 కోట్లతో పనులను చేపడతామని ఆయన పేర్కొన్నారు. ప్యాకేజీ 2 కింద 27.20 కిలోమీటర్లు, రూ.330 కోట్లతో పనులను చేపడుతుండగా, ప్యాకేజీ 3 కింద 33.35 కిలోమీటర్లు, రూ.417 కోట్లు, ప్యాకేజీ 4 కింద 24.64 కిలోమీటర్లు, రూ.297 కోట్లు, ప్యాకేజీ 5 కింద 10.53 కిలోమీటర్లు, రూ.152 కో ట్లతో అభివృద్ధి పనులను చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి ప్రాధాన్యతలో భాగంగా 5 ప్యాకేజీల్లో 120.92 కి.మీ.మేర పనులకు, రూ.1500 కోట్ల అంచనా వ్యయం కానున్నట్టు ఆయన పేర్కొన్నారు.
మొదటివిడత పనులు జరిగే ప్రాంతాలు
శంషాబాద్, ఎన్‌హెచ్ 44, ఓఆర్‌ఆర్, ఇబ్రహీపట్నం, వనస్థలిపురం, బడంగ్‌పేట్, దమ్మాయిగూడ,జవహర్‌నగర్, బాపూఘాట్ ఈసా నదీ, రాజ్‌భవన్ రోడ్డు ఆర్ అండ్ బి గెస్ట్‌హౌజ్, బేగంపేట్, కుత్భుల్లాపూర్, ఘట్‌కేసర్, చేవెళ్ల రోడ్డు, అప్పా జంక్షన్, అమీన్‌పూర్ తదితర ప్రాంతాల్లో మొదటివిడత పనులు జరుగనున్నాయి.