Monday, November 18, 2024

బిఆర్‌ఎస్‌లో చేరికల జోష్

- Advertisement -
- Advertisement -

గులాబీ పార్టీలోకి విపక్ష నేతల క్యూ

పాలమూరుకు చెందిన కీలక నాయకులు ఎర్ర శేఖర్, పి.చంద్రశేఖర్ చేరిక

నాగం జనార్దన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రులు కెటిఆర్, హరీశ్
ఆ తర్వాత ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసిన నాగం,
అదేబాటలో పిజెఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్: పాలమూరు జిల్లాలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు భారీ షాక్ తగిలింది. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెం దిన సీనియర్ నేతలు, మాజీ ఎంఎల్‌ఎలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి.. బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతో బలమైన నేతగా ఉన్న ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఆదివారం ఉదయం బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరగా, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, త్వరలోనే బిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావుల సమక్షంలో ప్రకటించారు. అలాగే పాలమూరు జిల్లాకు చెందిన బిజెపి పార్టీ నాయకులు, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ ఆదివారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు.
నాగంతో కెటిఆర్, హరీశ్‌రావు భేటీ
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి నివాసంలో ఆదివారం సాయంత్రం మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు,ఇతర బిఆర్‌ఎస్ నాయకులు ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం వారు నాగంను బిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించగా, అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం నాగం జనార్థర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సమావేశమై.. ఆ తర్వాత ముహూర్తం నిర్ణయించుకొని బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతానని కార్యకర్తల సాక్షిగా తెలుపుతున్నాననని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల కోరిక మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు నాగం వెల్లడించారు. కాంగ్రెస్ పొద్దున పార్టీలో చేరిన వారికి టికెట్ ఇస్తుంద ని… ఏళ్ల తరబడి పార్టీ కోసం పని చేసిన వారికి గుండుసున్నా చూపిస్తున్నదం టూ మండిపడ్డారు. నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్ అవమానించిందని మర్రి జనార్దన్‌రెడ్డి విమర్శించారు. నాగం జనార్దన్‌రెడ్డికి తాను కుమారుడి లాంటివాడిని అని, ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రశేఖర్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతో బలమైన నేతగా ఉన్న ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ఆదివారం బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు మంత్రి కెటిఆర్ గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వనించారు. ఎర్ర శేఖర్ చేరికతో పాలమూరులో బిఆర్‌ఎస్ మరింత బలోపేతం అవుతుందని కెటిఆర్ పేర్కొన్నారు.
ఉద్యమకాలం నుంచి కెసిఆర్‌తో అనుబంధం: ఎర్రశేఖర్
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సిఎం కెసిఆర్ నాయకత్వంలో పని చేస్తానని ఎర్ర శేఖర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో తనకు గొప్ప అనుబంధం ఉందని ఎర్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. గతంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న కెసిఆర్‌తో కలిసి పనిచేసిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచేలా ఆత్మగౌరవంతో బతికేలా సిఎం కెసిఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా ఎర్ర శేఖర్ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యంగా ముదిరాజులను ఆర్థికంగా స్థితి మంతులను చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలను భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేందుకు, కెసిఆర్ నాయకత్వంలో నడిచేందుకు బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.
మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉంది : పి.చంద్రశేఖర్
తెలంగాణ సాధించాక గతంలో అనివార్య కారణాల వల్ల పార్టీ వీడానని మాజీ మంత్రి పి.చంద్ర శేఖర్ పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కెసిఆర్‌కు చేదోడు వాదోడుగా ఉంటానని తెలిపారు. బిజెపిలో తనకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామ చేశారని చెప్పారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం కల్ల అని విమర్శించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కెసిఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ముదిరాజ్‌లకు అనివార్య కారణాల వల్లే కెసిఆర్ టికెట్లు ఇవ్వలేదని, సిటింగ్‌లలో ముదిరాజ్‌లు లేనందునే ఆ వర్గానికి టికెట్ రాలేదని వ్యాఖ్యానించారు.
సిఎం కెసిఆర్‌తో నాగం, విష్ణువర్ధన్ రెడ్డి భేటీ
మాజీ మంత్రి, నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆదివారం ప్రగతి భవన్‌లో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. మాజీ ఎంఎల్‌ఎ విష్ణువర్ధన్ రెడ్డి కూడా సిఎం కెసిఆర్‌తో భేటీ అయ్యారు.

Nagam Janardhan Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News