Monday, December 23, 2024

‘బిపర్‌జోయ్’తో ఊహించని రీతిలో నష్టం..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్ తీరం వైపు దూసుకువస్తున్న తీవ్ర పెను తుపాను బిపర్‌జోయ్ ఈ నెల 15వ తేదీ(గురువారం) సాయంత్రం గుజరాత్ కచ్ జిల్లాలోని జఖావు రేవు వద్ద తీరాన్ని దాటవచ్చని వాతావరణశాఖ తెలిపింది.తుపాను విరుచుకుపడే నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రంగం సిద్ధం చేశాయి. ఇప్పటికే ఎన్‌డిఆర్‌ఎఫ్, నేవీ, కోస్టల్‌గార్డ్, ఆర్మీని మోహరించడంతో పాటు సముద్ర తీరానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఈప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, మంగళవారం సాయంత్రానికల్లా అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని రాష్ట్ర అధికారి ఒకరు చెప్పారు.

కాగా, ఇప్పటివరకు తీవ్ర పెను తుపానుగా ఉన్న బిపర్‌జోయ్ కాస్త బలహీనపడి తీవ్ర తుపానుగా మారినప్పటికీ ఇది సృష్టించబోయే విధ్వంసం మాత్రం మామూలుగా ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర హెచ్చరిస్తున్నారు. గురువారం తుపాను తీరం దాటే సమయంలో తీవ్రస్థాయిలోనే నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. ముఖ్యంగా కచ్, దేవ్‌భూమి ద్వారకా, జామ్‌నగర్, పోరుబందర్,రాజ్‌కోట్, జునాగఢ్, మోర్బీ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని, తీరానికి చేరుకునే సమయానికి గంటకు 125నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, భారీ వర్షంతో పాటుగా గంటకు 140నుంచి 150 కిలోమీటర్ల దాకా వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని మహాపాత్ర తెలిపారు. ఆ ప్రభావం వల్ల చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

అలాగే పంటనష్టం కూడాతీవ్రంగానే ఉండవచ్చన్నారు. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో ఆరుమీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడతాయని, కాబట్టి ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. కాగా తుపాను తీరం దాటిన తర్వాత రాజస్థాన్ తూర్పు లోతట్టు దిశగా కదలవచ్చని, దీని ప్రభావం వల్ల ఉత్తర గుజరాత్‌లో 17వ తేదీ వరకు భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసేఅవకాశం ఉందని అహ్మదాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ మనోరమ మొహంతీ తెలిపారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్న జిల్లాల్లో ఇప్పటికే 17 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, 12 ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. మరో వైపు ఐదుగురు కేంద్రమంత్రులు గుజరాత్‌లోని వివిధ జిల్లాల్లో ఉంటూ సహాయ, పునరావాస కార్యకలాపాల్లో రాష్ట్రప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News