మహోగ్రరూపం చూపిన కడెం
భారీవరదతో వణికిపోయిన ప్రాజెక్టు
ఇంకా భయం గిప్పిట్లోనే 25గ్రామాలు
సాయంత్రానికి వరద తగ్గుముఖం
తేరుకున్న అధికార యంత్రాంగం
కొనసాగుతున్న వరద హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: భారీ వరదలతో కడెం నది మహోగ్రరూపం దాల్చింది. వరదపొంగులతో ప్రాజెక్టు గేట్లు ఎక్కి ప్రహహించింది. దిగువన నదిపరివాహకంగా ఉన్న 25గ్రామాలను గడగడలాడిచింది. ప్రాజెక్టు తెగిపోతుందన్న భయంతో జనం హడలిపోయారు. ఎగువ నుంచి వస్తున్న వరదకు, ప్రాజెక్టు గేట్లు ద్వారా దిగువకు విడుదలవుతున్న నీటివిడుదలకు సమన్వయం తప్పిపోయింది. గంటల తరబడి అధికార యంత్రాగాన్నిసైతం హడలగొట్టింది. ఒక దశలో కండె వరద ప్రవాహాన్ని కంట్రోల్ చేయలేక నీటిపారుదల యంత్రాంగం నిశ్చేష్టతకు లోనయింది. ప్రకృతి ప్రకోపాన్ని అదుపుచేయటం ఎవరి తరం కాదంటు అధికారులు నిట్టూర్పులు విడిచారు. ప్రాజెక్టు ఆనకట్టకు ఒదో ఒకవైపు గండి కొట్టి దిగువకు నీటిని విడుదల చేసేందుకు చేసిన ప్రయత్నాలకు కూడా వీల్లేకుండా పోయింది. దిగువన ఉన్న 25గ్రామాల్లో వరదముంపును అంచనా వేసిన జిల్లా కలెక్టర్ తక్షణం గ్రామాలను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా యుద్దప్రాతిపదికన అధికార యంత్రాగం రంగంలోకి దిగి 12గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించింది. మరో 13గ్రామాలు పాక్షికంగా ఖాళీ చేయించింది. ఇంతలోనే కడెం నది శాంతించింది. ఎగువ ప్రాంతంలో వర్షం తగ్గటంతో నదిలో వరద ప్రవాహం కూడా మెల్లగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. అధికార యంత్రాగం ఊపిరి పీల్చుకుంది. లోతట్టు గ్రామాలు మాత్రం ఇంకా భయాందోళనల్లోనే ఉన్నాయి. గోదావరికి ఉపనదిగా ఉన్న కడెం నది బుధవారం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి 5లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం కడెం ప్రాజెక్టుకు చేరుతుండగా అధికారులు ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తివేశారు.
కడెం ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటివిడుదల సామర్దం 2.99లక్షల క్యూసెక్కులు మాత్రమే కావటంతో అంతకు రెండింతలుగా ఎగువ నుంచి వరద ప్రాజెక్టును చుట్టేసింది. గంటల తరబడి ఈ పరిస్థితి కొనసాగింది. కడెం నదిపై 1958నిర్మించిన ఈ ప్రాజెక్టు అంతటి భారీ వరద వత్తిడికి తట్టుకుని నిలబడి ఆ నాటి ఇంజనీర్ల పనితాన్ని చాటి చెప్పింది. ఈ ప్రాజెక్టు ఎడమ కాలువ 76కిలోమీటర్లు ఉండగా, కుడి కాలువ 8కిలోమీటర్లు ఉంది. రెండు కాల్వలకు గరిష్టంగా నీటిని విడుదల చేశారు. అయితే అంత నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక ఎడమ కాలువకు గండి పడింది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 7టీఎంసీలు కాగా రెండు రోజుల కిందటే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. నిండుకుండలా ఉన్న రిజర్వాయర్‌లోకి భారీ వరద చేరటం, వరద నియత్రణకు వీలు కానంతగా అదుపు తప్పటంతో అందరూ హడలిపోయారు. సాయత్రం 6గంటలకు కడెం ప్రాజెక్టులోకి 299047క్యూసెక్కుల నీరు చేరుతుండగా, గేట్ల ద్వారా దిగువకు అంతే నీటిని విడుదల చేస్తున్నారు. అయితే దిగువ గ్రామాల్లో వరద హెచ్చరికలను మాత్రం కొనసాగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
Heavy Rains: Kadem Project 10 gates Opened