హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, సముద్రం మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
కింది స్థాయిలోని గాలులు ఉత్తర, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయని పేర్కొంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా నేడు హైదరాబాద్‌తో సహా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాపాతం నమోదయింది.