భారత దేశానికి అంతర్జాతీయ వేదికపై పేరు ప్రతిష్ఠలు తీసుకు వస్తున్న రెజర్లు తాము లైంగిక వేధింపులకు గురయ్యామని దేశ రాజధానిలో వీధి పోరాటం చేయాల్సి రావడం దేశ ప్రజలందరికీ సిగ్గుచేటైన విషయం. ఎంతో శక్తివంతంగా భావిస్తున్న మోడీ ప్రభుత్వం ఈ విషయంలో నిస్తేజంగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు (డబ్ల్యుఎఫ్‌ఐ) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బిజెపి ఎంపి కావడంతో అతనిని కాపాడడం కోసమే ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు అపవాదులను ఎదుర్కోవలసి వస్తుం ది. పైగా, 2021లో ప్రధానిని కలిసినప్పుడు తాము స్వయంగా లైంగిక వేధింపుల గురించి ఆయనకు తెలిపామని, ఆయన తగు చర్య తీసుకుంటామని హామీఇచ్చారని నిరసనకు పాల్పడుతున్న రెజర్లు చెప్పడంతో ప్రభుత్వం ఒక విధమైన ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తున్నది.
మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా, మహిళా రెజర్లతో ఈ విధమైన ఘర్షణకు పార్టీ ఎంపి దిగడం బిజెపి అగ్ర నాయకత్వానికి అసహనం కలిగిస్తున్నది. అయితే, రాజకీయంగా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో మౌనంగా ఉన్నట్లు అర్థమవుతుంది.నరేంద్ర మోడీ ప్రభుత్వం బేటీ బచావో కార్యక్రమం నుండి ఉజ్వల, జన్ ధన్ వంటి అనేక కార్యక్రమాలు మహిళా సంక్షేమం, మహిళా సాధికారికత కోసం ఉద్దేశించినవి. పైగా దేశంలో మరే రాజకీయ పార్టీలో లేనట్టి విధంగా పార్టీ పదవులలో మూడో వంతు మహిళలకు కేటాయించారు. అటువంటిది దేశం గర్వించే క్రీడాకారులు తాము లైంగిక వేధింపులకు గురయ్యామని నడివీధిలో ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం క్రియాశూన్యంగా కనిపించడం విచారకరం.
గతం జనవరిలో వీరు ఆందోళన ప్రారంభించినప్పుడు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ చొరవ తీసుకొని ఒక విచారణ కమిటీ వేసి వారికి న్యాయం జరిగేటట్లు చేస్తామని హామీ ఇచ్చి వారిని ఉపశమింప చేశారు. ఆ తర్వాత కమిటీ అయితే వేశారు గాని ఎటువంటి ముందడుగు వేయలేకపోతున్నారు.
గత జనవరిలో వీరు నిరసనలను ప్రారంభించినప్పుడు రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వినీష్ పొగట్ కనీసం 10 మంది రెజర్లు తమపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు చెప్పారని వెల్లడించారు. ఆ ఆరోపణను ఆయన నిరాకరించారు. అయితే, ఏప్రిల్ 28న ఒక మైనర్‌తో సహా ఐదుగురు రెజర్లు ఆయనపై కనౌట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ క్రీడాకారిణి పిటి ఉష నిరసనకారుల పట్ల అసహనంగా వ్యాఖ్యలు చేసినా ఆ తర్వాత ఆమె ఆందోళనకారుల శిబిరం వద్దకు వచ్చి తాను మొదట క్రీడాకారిణి అని, ఆ తర్వాతే ఇతర పదవులు అంటూ వారికి సంఘీభావం తెలిపి హుందాగా వెళ్లారు. ప్రభుత్వం చొరవ తీసుకొని వారి ఆరోపణలపై సత్వరం చర్యలు తీసుకొనే విధంగా చేయాల్సిందిపోయి, కనీసం చట్టప్రకారం పోలీసులు వారి ఫిర్యాదుకు స్పందించే పరిస్థితి కూడా లేకపోవడం గమనిస్తే దేశంలో మహిళల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అనే ఆందోళన కలుగుతుంది.
చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొంటే గాని వారి ఫిర్యాదును నమోదు చేయలేదు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్న సమయంలో పోలీసు అధికారులు రాత్రిపూట వారి శిబిరం వద్దకు మద్యం మత్తులో వెళ్లి వారిపట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పైగా ఈ సందర్భంగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చేస్తున్న వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉంటున్నాయి. చట్టం గురించి ఎటువంటి భయాందోళనలు లేనట్లు స్పష్టం అవుతున్నాయి.
పైగా బిజెపి నాయకత్వాన్ని బెదిరించే ధోరణిలో ఆయన మాటలు ఉంటున్నాయి. ప్రధాని, అమిత్ షా, జెపి నడ్డా ఆదేశిస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తాను అంటూ వారిని సహితం ఈ వివాదంలోకి లాగే విధంగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వం మేరీ కోమ్ నేతృత్వంలో నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ నివేదికను ఏప్రిల్ మొదటి వారంలోనే ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు దానిని బయటపెట్టకపోవడం, దానిపై తదుపరి చర్యలను తీసుకొనే ప్రయత్నం చేయకపోవడం గమనిస్తే నిందితుడు ఏ విధమైన ప్రభావం విచారణపై చూపిస్తున్నారో అర్థం అవుతుంది. ఉత్తర ప్రదేశ్‌లో నేరస్థులపట్ల సింహస్వప్నం యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం అని దేశ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ, ఈ ఎంపి సహితం నేర చరిత్రకు పేరొందినవారే అయినా అంత నిర్భయంగా వ్యవహరింప గలుగుతున్నారంటే అధికార పక్షం వారికి చట్టాలు వర్తింపవా? అనే ప్రశ్న తలెత్తుతుంది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు యుపిలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కైజర్గంజ్‌తో పాటు ఐదు లోక్‌సభ నియోజక వర్గాలలో మంచి పలుకుబడి ఉంది. వాటిల్లో నాలుగు స్థానాలను బిజెపి గెల్చుకొంటూ వస్తున్నది. ఈ నలుగురిలో ఆయనతో పాటు ముగ్గురు ఠాకూర్ ఎంపి లు. ఆయనపై ఏమైనా చర్య తీసుకొంటే వాటిని కోల్పోవలసి వస్తుందనే భయం ప్రధానంగా బిజెపిని వెంటాడుతున్నట్లు పలువురు భావిస్తున్నారు.
పైగా ఆరు సార్లు ఎంపిగా గెలుపొందగా, ఇప్పుడు ఆయన కుమారుడు ఎంఎల్‌ఎగా ఉన్నారు. మొదటిసారి 1991లో ఎంపిగా గెలుపొందగా, 1996లో దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై టాడా కేసు ఎదుర్కోవడం తో ఆయనకు సీట్ ఇవ్వడం సాధ్యపడలేదు. దానితో వరుసగా రెండు ఎన్నికలలో ఆయన భార్య పోటీ చేసి గెలుపొందింది. తిరిగి 1999 నుండి ఆయనే ఎంపిగా ఉంటూ వస్తున్నారు.పైగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు పదవిని తన సొంత బలంతో తెచ్చుకున్నారు. ఇప్పుడు రాజీనామా చేస్తే తనపై ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుందని స్పష్టం చేస్తున్నారు. పార్టీని మంత్రి పదవి గాని, మరే పదవి గాని ఇప్పటి వరకు అడగలేదు. రామ మందిర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నప్పటికీ సమాజవాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌తో మంచి సంబంధాలున్నాయి.
ఒకసారి ఆ పార్టీ ఎంపిగా కూడా గెలుపొందారు. ఆయనకు అయోధ్యకు 50 కి.మీ పరిధిలో 50 విద్యా సంస్థలు ఉన్నాయి. వాటి సహకారంతో పార్టీ అవసరం లేకుండా ఎన్నికల సమయంలో తన సొంత ఎన్నికల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటారు.
అందుకనే ఆయనకు బిజెపి అవసరంకన్నా, బిజెపికే ఆయన అవసరం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఈ కారణం చేతనే ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తే పార్టీ మారవచ్చని కూడా బిజెపి వెనుకడుగు వేస్తున్నట్లుంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న కుల సమీకరణలు సహితం ఈ విషయంలో బిజెపికి ఇరకాట పరిస్థితులు సృష్టిస్తున్నాయి. ఈ ఎంపి తో పాటు ఆ ప్రాంతంలో మొత్తం ముగ్గురు ఠాకూర్ ఎంపిలు ఉన్నారు. కేంద్ర క్రీడా మంత్రి కూడా ఠాకూర్. మరో వంక నిరసనలకు నేతృత్వ వహిస్తున్న క్రీడాకారిణులు జాట్‌లకు చెందినవారు. ఠాకూర్, జాట్ వైషమ్యాలు ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నాయి.
అందుకనే నిస్సహాయ స్టితిలో వీధులలోకి వచ్చి ఆందోళన జరుపుతున్న రెజ్లర్లకు బాసటగా నిలబడి, ఆ ఎంపిపై చట్టం ప్రకారం చర్య తీసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నదని, కేవలం కొన్ని నగరాలకు చెందిన క్రీడాకారులకు కాకుండా మారుమూల ప్రాంతాలలోని క్రీడాకారులను సహితం అంతర్జాతీయ పోటీలకు పంపి, తమ ప్రతిభను వెల్లడించుకొనే అవకాశం కల్పిస్తున్నదని ఎంతో గర్వంగా చెప్పుకొంటున్నారు. ఇదే సందర్భంలో దేశంలో క్రీడా సంఘాల యాజమాన్యంలో మాత్రం సంస్కరణలు తీసుకు రాలేకపోతున్నారు. గతంలో యుపిఎ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలు క్రీడా సంఘాలలో పెత్తనం చేస్తే, ఇప్పుడు బిజెపి నేతలు బిసిసిఐ వంటి వాటిపై పెత్తనం చేస్తున్నారు. పైగా మహిళా క్రీడాకారులకు తగు రక్షణ కల్పించడం, వారిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై తగు చర్య తీసుకొనేందుకు చట్టప్రకారం యంత్రాంగం ఏర్పాటు చేయడం పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకోవడం లేదని కూడా వెల్లడవుతుంది.
2013లో తీసుకొచ్చిన లైంగిక వేధింపుల నివారణ చట్టం (పోష్) చట్టం అమలు గురించి, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు గురించి ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. దేశంలో ఉన్న మొత్తం 30 జాతీయ స్పోర్ట్ ఫెడరేషన్లలో 16 ఫెడరేషన్లలో పోష్ చట్టం సవ్యంగా అమలవ్వట్లేదని చెబుతున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై అంతర్గతంగా విచారణ జరిపించేందుకు తగిన ఫిర్యాదుల కమిటీలు (ఐసిసి) ఏర్పాటు చేయడం లేదు. మరికొన్ని సంఘాల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా ఐసిసిల్లో తగినంత మంది సభ్యులు ఉండటం లేదు. నిర్భయ చట్టం తర్వాత లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రభుత్వ యంత్రాంగం క్రియాశీలకంగా వ్యవహరించవలసి ఉండటమే, దేశానికి విదేశాలలో పతకాలు సాధిస్తున్న క్రీడాకారుల విషయంలోనే తీవ్ర నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తూ ఉండటం తీవ్రమైన అంశంగా పరిగణించాలి.
ప్రస్తుతం నిరసనలతో పాల్గొంటున్న రెజ్లర్లలో చాలా మంది ఇంకా ఆడుతున్నవారే. తమ క్రీడా భవిష్యత్‌ను పణంగా పెట్టి తమ క్రీడాసమాఖ్యలలో కోచ్‌లు, ఇతర బలవంతులపై వారంతా సాహసంతో ఈ విధంగా నిరసనలు తెలుపుతారని ప్రభుత్వం భావించి ఉండదు.అందుకనే వారి నిరసనలపట్ల ఏ విధంగా స్పందించాలో తెలుసుకోలేక ఇరకాటంలో పడిన్నట్లున్నది. ప్రభుత్వం చట్టప్రకారం డబ్ల్యుఎఫ్‌ఐలో పోష్ చట్టం ప్రకారం లైంగిక ఆరోపణలపై విచారణకు అంతర్గత కమిటీని వెంటనే ఏర్పాటుచేయడం, రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయని పోలీసులపై చర్య తీసుకోవడం వంటి చర్యల ద్వారా చట్టం తనపని తాను చేసుకుపోతుందని విశ్వాసం కల్పించడం తక్షణం అవసరం. ఈ విషయంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష పర్యవేక్షణలో క్రియాశీల పాత్ర వహించవలసి ఉంటుంది.
చలసాని నరేంద్ర
9849569050