హైదరాబాద్: జాబిల్లిపై వచ్చే రెండు మూడు రోజుల్లో సందడి నెలకొంటోంది. భారతదేశపు ఇస్రోకు చెందిన చంద్రయాన్ 3, రష్యాకు చెందిన లూనా 25 వ్యోమనౌకలు దాదాపుగా ఏకకాలంలోనే చంద్రుడిపై సజావుగా దిగేందుకు రంగం సిద్ధమైంది. 1976లో అప్పటి సోవియట్ యూనియన్ ద్వారా ప్రయోగిత లూనా 24 తరువాత చైనాకు చెందిన ఛాంగ్ 3 2013లో , ఆ తరువాత ఛాంగ్ 4 2018లో చంద్రుడిపైకి వెళ్లాయి. అప్పటి నుంచి అక్కడ వ్యోమనౌకల ఆగమనం జరగలేదు. ఇప్పుడు విచిత్రమైన రీతిలో భారత్ చంద్రయాన్‌కు, రష్యా లూనాకు పోటీ నెలకొంది. రేస్‌లో ముందు చంద్రయాన్ 3 జాబిల్లిపై వాలుతుందని భావించారు. అయితే దీనిని లూనా 25 వెనకకు నెట్టివేసింది. ఈ నెల 21నే చంద్రయాన్‌కు ముందుగానే లూనా 25 చంద్రుడిపై వాలనుంది.
చంద్రయాన్ 3 నిర్ణీత దశ ప్రకారం ఈ నెల 23న చంద్రుడిపై చేరనుంది. ఇప్పటివరకూ ఏ వ్యోమనౌక వెళ్లని చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఎంచుకునే ఈ రెండు వ్యోమనౌకలు తమ లక్షాలను ఖరారు చేసుకున్నాయి. మనకు కన్పించే చంద్రుడికి ఆవలి వైపున ఉండే దక్షిణ ప్రాంతపు ఆవిష్కరణతో జాబిల్లిలోని పలు అపార అంతులేని రహస్యాలు వెలుగులోకి వస్తాయని ఇస్రో శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. అయితే చంద్రుడిపై ప్రయోగాల దిశలో సీనియర్ అయిన రష్యా లూనా శ్రేణి ప్రయోగాలతో చంద్రుడిని అత్యంత వేగంగా చేరుకుంటోంది. చంద్రయాన్‌తో పోలిస్తే ఇది ఎక్కువ స్పీడ్‌లో ఉంది. మరో విశేషం ఏమిటంటే చంద్రుడిపై వచ్చి వాలే ఈ భూగోళ అతిధులు చంద్రయాన్ 3, లూనా 25లు దాదాపుగా అత్యంత సమీపంలోనే నిలుస్తాయి. చంద్రుడిపైకి ప్రయోగాల క్రమంలో ఇప్పటివరకూ రష్యా అమెరికా చైనా సరసన ఇండియా కూడా చేరేందుకు వీలేర్పడింది.
చంద్రయాన్‌కు 23 రోజులైతే . లూనాకు కేవలం 6 రోజులే
లూనా 25 అత్యంత శక్తివంతమైన రాకెట్‌గా నిలిచింది. ఈ నెల 10వ తేదీన దీనిని ప్రయోగించారు. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే ఇది చంద్రుడి కక్షలోకిచేరింది. అదే చంద్రయాన్ 3 జులై 14న పరీక్షించగా ఇది ఈ దశకు చేరుకోవడానికి 23 రోజులు పట్టింది. చంద్రుడి పరిధిలోకి నేరుగా వెళ్లే శక్తివంతమైన రాకెట్‌ను ఇస్రో పూర్తి స్థాయిలో సంతరించుకోలేదు. పూర్తిగా వలయంగా తిరిగి ఇది చంద్రుడి వద్దకు చేరుకునే స్థాయిలో ఉంది. అయితే ఈ క్రమంలో చంద్రయాన్ 3 వ్యోమనౌకకు అయ్యే ఇంధనం , వ్యయ భారం తక్కువ. ఇదే దశలో లూనా 25 ఇందుకు విభిన్నం. ఇది నేరుగా చంద్రుడివైపే దూసుకుపోగల శక్తిని సంతరించుకుంది. షార్ట్‌కట్స్‌లేకుండా వలయాకార మార్గాలు కాకుండా ముందుకు సాగింది. అయితే ఇప్పుడు రెండూ ఏకకాలంలోనే చంద్రుడి కక్షలోనే ఉన్నాయి. చంద్రయాన్ 3 కన్నా ముందు ఇది చంద్రుడిపై వాలినా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా చంద్రుడిపై ఈ వ్యోమనౌకలు వాలే విషయాన్ని ఇతర అంశాలు కూడా నిర్థారిస్తాయి.
చంద్రుడి పగటి కాలం కీలకం
ఈ నెల 23 చంద్రుడికి పగటి సమయం ఆరంభమయ్చే రోజు. భూమిపై దాదాపు 14 రోజులతో ఒక్క చంద్రుడి రోజు సమానం అవుతుంది. ఈ పగటి దశలో నిరంతరంగా సూర్యకాంతి అందుబాటులో ఉంటుంది. చంద్రయాన్ 3లోని పరికరాలు సూర్యకాంతితో పనిచేస్తాయి. ఇవి ఒక్క రోజు చంద్రకాంతి పరిధిలోనే ఉన్నాయి. ఇవి పనిచేసేందుకు సూర్యకాంతి అవసరం. దీనిని పరిగణనలోకి తీసుకునే చంద్రయాన్ 3 నౌక ఆగస్టు 23న ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాట్లు జరిగాయని వెల్లడైంది. చంద్రుడు రాత్రివేళలో పూర్తిగా శీతలంగా ఉంటాడు. ఇది దాదాపుగా మైనస్ 100 డిగ్రీ సెల్సియస్‌కు దిగువదాకా ఉంటుంది. ఈ రాత్రి వాతావరణంలో తట్టుకుని నిలిచే విధంగా ఎలక్ట్రానిక్‌వ్యవస్థను రూపొందించలేదు. అత్యంత శీతల స్థితిలో ఇవి పనిచేయకుండా పోతాయి. కేవలం తమ ముందు ఉండే పగటి కాలం పనిచేసేందుకు అనువుగా ఉంటుంది. లూనార్ డే ఆరంభం నుంచి ముగింపు దశ వరకూ చంద్రుడిపై ప్రయోగాలకు అనువైన వాతావరణం ఉంటుంది.
అనుకున్న విధంగా ఈ నెల 23నే చంద్రుడిపైకి చంద్రయాన్ నౌక దిగాలి లేకపోతే మరో రోజు ఆగాలి. అప్పటికీ సాఫ్ట్‌ల్యాండింగ్ సాధ్యం కాకపోతే ఇక ల్యాండింగ్‌కు దాదాపు 29 రోజులు ఆగాల్సిందే. చంద్రుడి రాత్రివేళ వెళ్లిపోయి, పగటి వేళ వచ్చే వరకూ ఆగి ల్యాండింగ్ కావల్సిందే. లూనాకు సంబంధించి ఇటువంటి నియంత్రణలు లేవు. ఇది కూడా సౌరశక్తితో పనిచేసేదే. అయితే దీనికి అత్యంత వేడిని కల్గించే శక్తివంతమైన జనరేటర్ ఉంది. రాత్రివేళలో కూడా పరికరాలు పనిచేసేందుకు అవసరం అయిన అందుతుంది. పైగా దీని జీవితకాలం ఏడాది వరకూ ఉంది. సూర్యుడి కాంతి చంద్రుడిపై ఎంతసేపు పడుతుందనే అంశంతో నిమిత్తం లేకుండా దీని ల్యాండింగ్ ప్రక్రియ ఉంటుంది. చంద్రయాన్ 3 దక్షిణ ధృవానికి సమీపంలోనే వాలుతుంది. అయితే నిజానికి ఇది పూర్తిగా దక్షిణ ధృవం కాదు. ఇది వాలే ప్రాంతం చంద్రుడి దక్షణ రేఖాంశంపై దాదాపు 68 డిగ్రీలు ఏటవాలుగా ఉంటుంది. లూనా 25 దక్షణ ప్రాంతంలో దాదాపు 70 డిగ్రీల సమీపంలో ఉంటుంది.
ఈ క్రమంలో ఈ రెండూ ప్రయోగాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇంతవరకూ చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమనౌకలు ఎక్కువగా చంద్రుడి మధ్య ప్రాంతాన్ని ఎంచుకున్నాయి. అక్కడ సూర్యకాంతి ఎక్కువగా సోకుతుంది. ఇక లూనాకు చంద్రయాన్ 3 నౌకకు చబద్రుడి ఉపరితలంపై ఉండే దూరం కొన్ని వందల కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. చంద్రుడి దక్షిణ ప్రాంతంలో అపారమైన ఘనీభవ జలరాశులు ఉన్నాయని, ఇవి పలు విలువైన ఖనిజాల నిక్షిప్తం అని శాస్త్రీయ ఆధారాలతో తేలడంతో ఇకపై ఈ ప్రాంతం అంతా పోటాపోటీగా పలు దేశాల నుంచి అంతరిక్ష నౌకల ఆగమనానికి దారితీయవచ్చు.