శ్రీశైలం నుండి సోమశిల..నాగార్జున సాగర్‌కు
రెండు మార్గాల్లో పడవ ప్రయాణానికి టిఎస్ టిడిసి ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్ : భారీ వర్షాలతో రాష్టంలోని జలాశయాలు కళకళ లాడుతున్నాయి. శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరుస వర్షాలతో వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ తదితర జలాశయాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశీ టూరిస్టులు కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్ , సోమశిల సహా పలు ప్రాంతాలను చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఇదే అదునుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కూడా పర్యాటకులకు బోటింగ్ లాంటి సదుపాయాల కల్పన ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని భావిస్తోంది.
బోటింగ్ ద్వారా అటు పర్యాటకులకు టూర్ సదుపాయం కల్పించడం ఒకటైతే.. తద్వారా టిక్కెట్.. టిక్కెట్ అంటూ ఆర్‌టిసి తరహాలో టిక్కెట్లతో టిఎస్ టిడిసి సంస్థకు టూరిస్టుల నుండి ఆదాయం కూడా రానుంది. ఈ డబ్బులను పర్యాటకులకు మేలైన సదుపాయాలు కల్పించేందుకు ఉపయోగించుకుంటున్న పర్యాటకాభివృద్ధి సంస్థ ఏటా ఏఏ చోట్లకు టూరిస్టుల తాకిడీ ఉండనుందో అక్కడ బోటింగ్ సదుపాయలతో పాటు వారు కోరే ఇతర సౌకర్యాలు.. సదుపాయాలు కల్పించి తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూస్తోంది. తాజాగా మరో వారం పది రోజుల్లోనే శ్రీశైలం కేంద్రంగా రెండు చోట్లకు బోటింగ్ ప్రయాణాలకు ఏర్పాట్లు చేస్తోంది. సోమశిల నుండి శ్రీశైలంకు ఒకటి అయితే.. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలంకు మరో బోటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని..వారం పది రోజుల్లోనే “క్రూస్ బోటింగ్” ప్రయాణాలను కల్పిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ చెబుతోంది. శ్రీశైలానికి పెరిగిన వాటర్ లెవల్స్ …వరుస వర్షాలతో శ్రీశైలం, నాగార్జున సాగర్, సోమశిల సహా రాష్ట్రంలోని ఇతర నదుల్లోనూ భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. గత వారం పది రోజుల క్రితం ఎడతెరిపిలేకుండా వర్షాలు కురువడంతో కృష్ణానది పోటెత్తింది. జూరాల నుంచి కృష్ణా ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,60,750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ప్రాజెక్టులో 885 అడుగుల వద్ద 220 టిఎంసీలను నిల్వ చేశారు. ఇది రోజు రోజుకు మరింతగా పెరుగుతూ వస్తోంది కూడా. అటు నాగార్జున సాగర్‌లోకి వస్తున్న 3,38,298 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తూ సాగర్‌లో 588.8 అడుగుల వద్ద 308 టిఎంసిల నిల్వను కొనసాగిస్తున్నారు. అటు సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎప్పటికప్పుడు అధికారులు క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సోమశిల డ్యాం కెపాసిటీ 78 టిఎంసీలు కాగా ప్రస్తుతం 71.29 టిఎంసీలుగా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 175 బోట్లకు తాకిడి..
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 175 బోట్లను తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, దుర్గం చెరువుతో పాటు నిజామాబాద్ జిల్లా అలీసాగర్ వరంగల్ జిల్లా రామప్ప, కోటిలింగాల, లక్నవరం, కరీంనగర్ జిల్లాలోని ఎల్‌ఎండి.. ఇలా ఆయా చోట్ల ఈ బోట్లన్నింటికి కూడా పర్యాటకుల నుండి తాకిడి పెరుగుతోంది. ఒక రకంగా భారత దేశం మొత్తంలోనే తెలంగాణలోనే అత్యధికంగా బోట్లు నడుస్తున్నాయి. ఈ స్థాయిలో దేశంలోనే మరే ఇతర రాష్ట్రంలోనూ బోటింగ్‌లు లేక పోవడం విశేషం.