Saturday, June 29, 2024

లిక్కర్‌స్కాం కేసులో కేజ్రీవాల్‌కు మరోషాక్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను విచారించడానికి సీబీఐ అడిగిన ఐదు రోజుల కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మూడు రోజులు మాత్రమే అనుమతిచ్చింది. అంతేకాదు సిబిఐ మూడు రోజుల కస్టడీ సమయంలో కేజ్రీవాల్‌ను కలుసుకోడానికి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌కు,అతని న్యాయవాదికి ప్రతిరోజూ 30 నిమిషాల పాటు అనుమతించింది. దీంతోపాటు కేజ్రీవాల్ సూచించిన మందులు, ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని అందించేందుకు కూడా కోర్టు వారికి అనుమతించింది. లిక్కర్ పాలసీ కేసులో మంగళవారం తీహార్ జైలులో కేజ్రీవాల్‌ను సిబిఐ విచారించింది. బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది.

ఈ కేసులో మరింత దర్యాప్తు చేసేందుకు కస్టడీ తీసుకునేందుకు అనుమతి కావాలని కోర్టులో దరఖాస్తు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు సిబిఐకి అనుమతించింది. ఈమేరకు జడ్జి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సిబిఐ అధికారులు కేజ్రీవాల్‌ను అదుపు లోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేశారు. పాలసీ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు సిబిఐ అడిగిన ఐదు రోజుల కస్టడీ కాకుండా మూడు రోజులు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. ఈ మూడు రోజుల పాటు కేజ్రీవాల్ సిబిఐ కస్టడీలో ఉండనున్నారు. తిరిగి ఈనెల 29వ తేదీన సాయంత్రం 7గంటల్లోగా కోర్టులో కేజ్రీవాల్‌ను సిబిఐ ప్రవేశ పెట్టవలసి ఉంటుంది.

బుధవారం ఉదయం తీహార్ జైలు నుంచి సీబీఐ అధికారులు కేజ్రీవాల్ ను అదుపు లోకి తీసుకుని కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే తనపై సీబీఐ అధికారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేజ్రీవాల్ కోర్టుకు తెలియజేశారు. లిక్కర్ స్కామ్ సూత్రధారిగా మనీష్ సిసోడియా పేరును తాను విచారణలో తెలిపినట్టు సిబిఐ ప్రచారం చేసిందని, ఇది నిజం కాదని కేజ్రీవాల్ చెప్పారు. తనతోపాటు సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కేసులో నిర్దోషులని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సంచలనాత్మకం చేయాలని సిబిఐ ప్రయత్నిస్తోందన్నారు. అన్ని పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో ఇది రావాలని చూస్తోందన్నారు. సిబిఐ తరఫు న్యాయవాది అలాంటి ఆరోపణలకు ఆధారాలేవీ లేవన్నారు.

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రూ.43 కోట్ల హవాలా నగదును ఆప్ ఉపయోగించిందని, లిక్కర్ స్కాంలో వసూలు చేసిన డబ్బుతోనే అక్కడ ఖర్చు చేశారని, సిబిఐ ఆరోపించింది. విజయ నాయర్, ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్ లాంటి నేతలు లిక్కర్‌స్కాం అంతా మనీష్ సిసోడియాకే తెలుసని అంటున్నారని, దీనిపై వాస్తవాలు వెలుగు లోకి రావలసి ఉందని సిబిఐ పేర్కొంది. లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ కేసులో ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు ఇచ్చిన బెయిలుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించగా, కేజ్రీవాల్ దానిపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే సిబిఐ కేసుతో సుప్రీం కోర్టు నుంచి పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నారు. మరోసారి సమగ్ర సమాచారంతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News