Monday, December 23, 2024

సబ్‌స్టేషన్‌లో ఫీడర్ మరమ్మతులు నిర్వహిస్తుండగా ప్రమాదం

- Advertisement -
- Advertisement -

త్రిపురారం : త్రిపురారం సబ్ స్టేష్‌లో ఫీడర్ మరమ్మత్తులో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఇరువురు ప్రమాదవశాత్తు షార్ట్‌సర్కూట్‌కు గురయ్యారు. వివరాల్లోకెళ్లే..మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో ముకుందాపురం ఫీడర్‌కు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో మరమ్మతుల నిమిత్తం అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్ ద్వారా ఎస్‌సి తీసుకొని ముకుందాపురం ఆపరేటర్ ముడి నాగయ్య, ఆర్టిజన్ వర్కర్ సపావత్ అశోక్‌లు మరమ్మతులు చేపడుతుండగా, ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు వ్యాపించడంతో ట్రాన్స్‌ఫార్మర్ స్తంభంపై ఉన్న అశోక్, నాగయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే విధుల్లో ఉన్న ఆపరేటర్ శీను అక్కడి నుండి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

విద్యుత్ సరఫరా నిలిపివేసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే మిర్యాలగూడకు తరలించగా, అశోక్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నల్లగొండ తరలించినట్లు తెలిపారు. నాగయ్య మిర్యాలగూడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన నాగయ్యకు ఇటీవలే జూనియర్ లైన్‌మెన్‌గా ఉద్యోగం వచ్చింది. అతనికి సహాయకారిగా ఆర్టిజన్ విధులు నిర్వహిస్తున్న తిరుమలగిరి( సాగర్ ) మండలం జువిచెట్టు తండాకు చెందిన సపావత్ అశోక్ విధి నిర్వహణలో ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న ఏఈ రవీందర్‌రెడ్డి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదఘటనపై ముడి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కైగూరి వీరశేఖర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News