Thursday, January 23, 2025

స్వయంకృషితో ఎదిగిన ధీశాలి

- Advertisement -
- Advertisement -

పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆ విద్యావేత్త స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారు. విద్యారంగంలోనూ సాహిత్యరంగంలోనూ సామాజికరంగంలోనూ విశేష కృషి చేశారు. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు కార్యదర్శిగా సేవలందించారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా పనిచేశారు. ఏడు పదుల వయస్సులో పక్క రాష్ట్రంలో పిహెచ్.డి. చేశారు. విశిష్ట సేవలకు కేంద్ర ప్రభుత్వంఅందజేసే ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని పొందారు.ఉపనిషత్తులను సులభగ్రాహ్యమైన తెలుగు భాషలో అందజేశారు. ఆయనే డా.టి.వి.నారాయణగా సుప్రసిద్ధులైన డాక్టర్ తక్కెళ్ల వెంకట నారాయణ.
నేటి మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బొల్లారంలో వెంకయ్య. నర్సమ్మ దంపతులకు 1925 జులై 26వ తేదీన జన్మించారు టి.వి.నారాయణ. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో శ్రమనే నమ్ముకుని స్వయంకృషితో ఎదిగారు. తన తమ్ముళ్లకు తండ్రి లేని లోటు తెలియకుండా పెంచారు. వారిని గ్రూపు 1 అధికారులుగా తీర్చిదిద్దారు. బొల్లారం రెసిడెంట్ స్కూల్లో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. నిజాం కళాశాలలో గణిత శాంలో డిగ్రీ చేశారు. ఆ కాలంలో బొల్లారం నుండి సికింద్రాబాదు వరకు రైల్లో వచ్చి, సికింద్రాబాదు నుండి నిజాం కళాశాల వరకు నడుచుకుంటూ వెళ్లి, చదువుకునేవారు. ఆ తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో ఎమ్మే చేశారు. 71 సంవత్సరాల వయసులో ఆయన పిహెచ్.డి. చేయడం విశేషం. ‘ఎపిపిఎస్సీ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కంట్రిబ్యూషన్’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేటు పొందారు. ఆర్య సమాజ సిద్ధాంతాలపై ఆయన పలు పరిశోధనలు చేశారు.
తెలంగాణ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు టి.వి.నారాయణ. స్వామి రామానంద తీర్థతో కలిసి, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. రజాకార్ల నుండి తప్పించుకునేందుకు అజ్ఞాతవాసం కూడా చేశారు. ఆర్యసమాజం సహాయంతో దళిత వర్గాలకు విద్యనందించేందుకు కృషి చేశారు. 1978లో హైదరాబాదు కేంద్రంగా ‘సేవాభారతి’ అనే సంస్థ ఏర్పడ్డప్పుడు ఆ సంస్థకు తొలి అధ్యక్షులుగా పనిచేశారు. అనంతర కాలంలో కేంద్రమంత్రిగా పనిచేసిన బండారు దత్తాత్రేయ ఆ సంస్థకు తొలి కార్యదర్శిగా వ్యవహరించారు.
ఉద్యోగ జీవితం తొలి దశలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు నారాయణ. తాను చదువుకున్న పాఠశాలలోనే 1946లో తాత్కాలిక ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. 1954లో హైదరాబాదులో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పనిచేశారు. జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా పనిచేశారు. సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. విద్యాశాఖలో డిప్యూటీ డైరెక్టరుగా ఉద్యోగ విరమణ చేశారు. 1974 నుండి 1980 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా పనిచేశారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహకమండలి సభ్యుడిగా సేవలందించారు. ఆర్యప్రతినిధి సభ రాష్ట్ర అధ్యక్షుడిగా, భాగ్యనగర్ ఖాదీ కమిటీ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమీషన్ సభ్యుడిగా, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. కాకతీయ విశ్వవిద్యాలయ సిండికేట్ సభ్యుడిగా, జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టరుగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా, నంది అవార్డు కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు.
బొల్లారంలోని ఆర్య సమాజ్‌లో ట్యూషన్ చెప్పే సమయంలో అక్కడికి చదువుకునేందుకు వచ్చిన సదాలక్ష్మితో నారాయణకు పరిచయం పెరిగింది. ఆర్యసమాజ్‌లోనే కులాంతర వివాహం చేసుకున్నారు. సదాలక్ష్మి శాసనసభ్యురాలిగా, మంత్రిగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. సాహిత్య రంగంలో టి.వి.నారాయణ విశేష కృషి చేశారు. వివిధ ప్రక్రియల్లో పలు రచనలు చేశారు. గేయ, పద్య, ఆధ్యాత్మిక రచనలతో పాటు శతక రచన కూడా చేశారు. జీవిత చరిత్రలను వెలువరించారు. దాదాపు 20 గ్రంథాలను వెలువరించారు. ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం వివిధ అంశాలపై ఆయన ప్రసంగాలను ప్రసారం చేసింది. వేదాల్లోని అనేక సామాజికాంశాలను విశ్లేషిస్తూ ‘శ్రుతి సౌరభం’ అనే పద్య కావ్యాన్ని 2002లో వెలువరించారు. అనంతరం 2009లో ‘జీవనవేదం’ అనే మరో పద్య కావ్యాన్ని ప్రచురించారు. ‘ఆత్మ దర్శనం’ అనే కవితాసంపుటిని వెలువరించారు.
‘అవధరింపుమయ్య ఆర్షపుత్ర’ అనే మకుటంతో ‘ఆర్షపుత్ర శతకా’న్ని 1991లో టి.వి.నారాయణ వెలువరించారు. ఆ శతకాన్ని తన సోదరుడు టి.వి.శంకర రావు కు అంకితమిచ్చారు. సమాజ స్థితిగతులను ఈ శతకంలో ఆటవెలదుల రూపంలో పేర్కొన్నారు టి.వి.నారాయణ. అనేక సుభాషితాలు ఈ శతకంలో చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు కింది పద్యాన్ని గమనించవచ్చు.
“నేల మీద మనిషి నివసించవలెగాని
ఊహజాలమందు ఊగరాదు
గాలి ఊహలన్ని గగన పుష్పమ్ములే
అవధరింపుమయ్య ఆర్షపుత్ర”
ఈ శతకంతో పాటు 2008లో ‘భవ్య చరిత శతకం’ అనే పేరుతో మరో శతకాన్ని కూడా ప్రచురించారు టి.వి.నారాయణ. ‘భరత వంశ తిలక భవ్యచరిత’ అనే మకుటంతో ఈ శతకాన్ని రాశారు. తన మనుమడి పేరుమీద మకుటంతో రాసిన ఈ పద్యాల్లో కుల, మత తత్వంపై నిరసన కనబడుతుంది. అనేక సామాజిక అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు ఈ ఆటవెలది పద్యాల్లో దర్శనమిస్తాయి.
“తప్పు చేసి గూడ తమదగు తప్పును
కప్పిపుచ్చువారు కలుషమతులు
ఒప్పుకొనెడివారు గొప్ప మనీషులు
భరతవంశ తిలక! భవ్య చరిత!”
డాక్టర్ టి.వి. నారాయణ 1983లో ‘ఆత్మదర్శనం’ అనే గేయ కావ్యాన్ని రచించారు. ఈ కావ్యాన్ని తన తండ్రికి అంకితమిచ్చారు. ‘మిము వీడిన ఫలం’ అనే గేయ సంపుటిని కూడా ఆయన వెలువరించారు. పలువురు మహనీయుల జీవిత చరిత్రలను, వారి బోధనలను తెలుపుతూ 2001లో ‘మహనీయుల మహితోక్తులు’ అనే గ్రంథాన్ని వెలువరించారు. సంత్ రవిదాస్ జీవిత చరిత్రను ‘మహర్షి సంత్ రవిదాస్ జీవిత చరిత్ర’ అనే పేరుతో ప్రచురించారు.
డాక్టర్ టి.వి. నారాయణ ఆధ్యాత్మిక సాహిత్యంలోనూ ఉత్తమ స్థాయి రచనలు చేశారు. ఉపనిషత్తులను అధ్యయనం చేసిన ఆయన వాటిని తెలుగులో సులభగ్రాహ్యమైన భాషలో అనువదించారు. ‘కఠోపనిషత్తు’, ‘ముండకోపనిషత్తు’, ‘తైత్తరీయోపనిషత్తు’ ‘కేనోపనిషత్తు’లను తెలుగులోకి తీసుకునివచ్చారు. ‘ఉపనిషత్ వాక్ సుధా స్రవంతి’ అనే గ్రంథ రచన చేశారు. ఈశావాస్యోపనిషత్తు, కఠోపనిషత్తులపై తాను ఆకాశవాణి మాధ్యమంగా చేసిన ప్రసంగాలను ‘అవమ వాక్సుధా స్రవంతి’ అనే పేరుతో గ్రంథ రూపంలోకి తీసుకువచ్చారు. ఈ గ్రంథాన్ని సుప్రసిద్ధ పండితులు సోమదేవ శాస్త్రికి అంకితమిచ్చారు.
విద్యారంగంలో విశేష కృషి చేయడంతో పాటు విద్యను సామాజిక మార్పుకు సాధనంగా ఉపయోగించారు డా.టి.వి.నారాయణ. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. భారత రాష్ట్రపతి చేతులమీదుగా ఉత్తమ వేద పండితుడిగా పురస్కారాన్ని స్వీకరించారు నారాయణ. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ధర్మరత్న పురస్కారాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు దళితరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది. కాకతీయ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు అందజేసి, గౌరవించాయి. స్వయంకృషితో ఎదిగిన డా.టి.వి.నారాయణ జీవితం భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలుస్తుంది.
విద్యావేత్త డా.టి.వి. నారాయణ మరణించిన సందర్భంగా

                                                                     డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News