పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
చండీగఢ్ : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఉద్యమానికి పంజాబ్ ప్రభుత్వం మరోసారి సంఘీభావం తెలియచేసింది. ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన రైతులకు రూ. 2 లక్షల వంతున ఆర్థిక సాయం ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పోలీసులు అనుమతించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో రైతులు వెళ్లి ఎర్రకోటను ముట్టడించి జెండా ఎగుర వేశారు. ఇది హింసాత్మక సంఘటనకు దారి తీయడంతో పోలీసులు 83 మంది రైతులను అరెస్టు చేశారు. అరెస్టయిన ఈ 83 మంది రైతులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే ఈ తాజా నిర్ణయం కేంద్రం, పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య కొత్త వివాదానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.