Thursday, January 23, 2025

పెరుగుతున్న బహుముఖీన దారిద్య్రం

- Advertisement -
- Advertisement -

2020 యునిసె ఫ్, సేవ్ ది చిల్డ్రన్ సంస్థల నివేదికలు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ల పిల్లలు కడు పేదరికంలో మగ్గుతున్నట్లు తెలిపారు. ఈ కరోనా కాలంలో అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లో ఈ సంఖ్య మరి 15% పెరిగి మరో 150 మిలియన్ల చిన్నారులు ఈ బహుముఖీన పేదరికంలో జారుకున్నారు. ప్రస్తుతం మరో 10% మంది చిన్నారులు పెరిగి, ప్రపంచ వ్యాప్తంగా బాలలు కడు పేదరికంలో ముఖ్యంగా తినడానికి తిండి, కట్టుకోవడానికి దుస్తులు, ఉండటానికి నివాసం లేక అలమటిస్తున్నారు.
పలు దేశాల్లో రాజకీయ అస్థిరత్వం, ధరలు పెరగడం, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం కారణాలు అయితే, మరో పక్క కరోనా కాలంలో లాక్‌డౌన్, కర్ఫ్యూలు, ఇంకా ఈ వైరస్ మన వెంటే ఉండడం వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం, పరిశ్రమలు మూతపడంతో ఈ పేదరికం విష వృక్షం కోరల్లో కొన్ని కోట్ల మంది చిక్కుకుని తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటూ, అత్యంత దయనీయ స్థితిలో ఉండుట బాధాకరం. అంతర్జాతీయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వీరి కనీస అవసరాలు తీర్చడానికి చేయూత నివ్వాలి. ఈ పరిస్థితులు చాలవు అన్నట్లు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, శ్రీలంక ఆర్థిక సంక్షోభం, అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ పాలన, మయన్మార్‌లో సైనిక పాలన, పాకిస్తాన్‌లో రాజకీయ పరిణామా లు, సిరియా శరణార్థులు ఇటువంటి పరిస్థితు ల్లో ముఖ్యంగా ఈ ఆసియా దేశాలు, అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ప్రజలు, చిన్నారులు చరిత్రలో ఎన్నడూలేని విధంగా కడు పేదరికంలోకి బలవంతంగా నెట్టివేయబ డుతున్నారు.
ప్రతి అల్పాదాయ వర్గాల వారికి, ప్రజలకు ఆహారం, దుస్తులు, విద్య, వైద్యం, ఆవాసం, పోషకాహారం అందడం జరగాలి. ఈ కనీస సౌకర్యాలు / అవసరాలు లేకపోవడమే మల్టీ డైమెన్షనల్ పేదరికం అని పేర్కొంటారు. సుమారు 45% పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా ఈ సౌకర్యాలు లేకుండా ఉన్నారు అని యునిసెఫ్ నివేదిక చెబుతోంది. ఈ కరోనా కాలంలో చాలా దేశాల్లో కర్ఫ్యూలు, లాక్‌డౌన్ల వలన పరిశ్రమలు మూతపడ్డాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయి లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ‘యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్’ మాట్లాడుతూ ‘చాలా కుటుంబాలు కడు పేదరికంలో జారుకు న్నాయని, కొవిడ్ ప్రారంభ సమయం కంటే ముగింపు దినాలు మరింత దుర్భరమైన జీవితాన్ని ఇచ్చింది’ అని తెలిపారు. పేద కుటుంబాల్లో చిన్న పిల్లలే సంపాదించే మార్గంగా ఉంటున్నారు అనేది జగమెరిగిన సత్యం. పని లేకపోవడం వల్ల, తిండి లేక పోషకాహార లోపంతో అనారోగ్యాలకు గురవుతున్నారు. చదువుకు దూరం అవు తున్నారు. విద్యాసంస్థలు మూతపడ్డాయి. బాల్య వివాహాలు పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలు, ఆర్థిక కార్యకలా పాలు పునఃప్రారంభం చేయడానికి అన్ని దేశాలు సత్వరం చర్యలు చేపట్టాలి. ఉపాధి కల్పన ద్వారానే కనీస అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం బాగు పడుతుంది. ప్రభుత్వాలు పనిచేసే వారికి పెయిడ్ లీవ్, చైల్డ్ కేర్ పాలసీలు అమలు చేయాలి. సేవ్ ది చిల్డ్రన్ సిఇఒ ఇంజర్ ఆషింగ్ మాట్లాడుతూ ‘కరోనా పిల్లలను విద్యకు దూరం చేసింది. దారిద్య్రం మరింత రెట్టింపు చేసింది’ అని తెలిపారు. బాల కార్మికులు పెరగడం జరిగింది. ప్రపంచాన్ని మరో రెండు దశాబ్దాల వెనక్కి తీసుకుని వెళ్ళింది. ప్రపంచ సంస్థలు, వివిధ దేశాల ప్రభుత్వాలు వీరి భవిష్యత్తుకు ప్రణాళికలు రచించాలి. ఇప్పటికే 15% పేదరికం పెరిగిందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఒక పక్క కరోనా, ప్రకృతి విపత్తులు వలన అల్ప మధ్య ఆదాయ ప్రజలు, దేశాలు కూనారిల్లుతుండగా, మరోపక్క మానవ తప్పిదాలతో మరెందరో పేదరికం బారిన పడుతున్నారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో తాలిబన్లు అఫ్ఘానిస్తాన్‌లో పాలన చేపట్టిన తర్వాత సుమారు 3.4 మిలియన్ల మంది అఫ్ఘన్ ప్రజలు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్ళిపోయారు అని ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ (యుయన్‌హెచ్‌సిఆర్) తెలిపారు. వీరిలో ఎక్కువ మంది ఇరాన్, పాకిస్థాన్ దేశాలకు 2 మిలియన్ల మంది శరణార్థులుగా వెళ్లారు. తాలిబాన్లు పాలన వల్ల ప్రపంచంలోని అత్యంత దయనీయ స్థితికి అఫ్ఘానిస్తాన్ చేరింది అని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. ఆర్థిక, సామాజిక, అంతరాలు లింగ వివక్షతో కూనారిల్లుతుంది. 1979 నుంచే ఈ అఫ్ఘాని స్తాన్ నుండి వలసలు ప్రారంభమ య్యాయి అని చరిత్ర చెబుతోంది. 37% కుటుంబాలు సరైన సంపాదన లేక, 33% శాతం జనాభా కొనుగోలు శక్తి లేక ఆహార లేమితో బాధపడుతున్న దయనీయ స్థితి, ఆఫ్ఘానిస్తాన్ జిడిపి 34% తగ్గింది. ఇక శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయి, తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇక్కడ ప్రజలు వలసలు బాటపట్టారు. భారత్‌లోకి వస్తున్నారు. మన సరిహద్దు దేశం పాకిస్తాన్ రాజకీయ అస్థిరత్వంతో, అప్పులు బాధతో రోజు రోజుకు దిగజారుతుంది. ఇటీవల యుద్ధం కారణంగా, ఏప్రిల్ 25 తేదీ నివేదిక ప్రకారం ఉక్రెయిన్ నుంచి సుమారు 12 మిలియన్ల మంది స్థానభ్రంశం చెందారు. వీరిలో పోలెండ్ దేశానికి 29,09,415 మంది, రొమేనియాకు 7,77,602, రష్యా కు 6,05,815 మంది, హంగేరికి 4,92,976, మాల్దోవాకు 4,43,895 మంది, స్లోవేకియా కు 3,55,593 మంది, బెలారస్ కు 24,477 మంది శరణార్థులుగా వెళ్లారని ఐక్యరాజ్య సమితి, ఐఒయం తెలిపింది. ఈ విధంగా కరోనా, ప్రకృతి వైపరిత్యాలు వలన, మరో పక్క రాజకీయ, ఆర్థిక, యుద్ధ కారణాలు వలన ప్రపంచంలోని అనేక అల్ప మధ్య ఆదాయ ప్రజలు, బాలలు కడు పేదరికం, దుర్భరమైన జీవితాన్ని చవిచూ స్తున్నారు. మానవ హక్కులు లేని జీవితాలు పట్ల పలు అంతర్జాతీయ సంస్థలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
మహిళలు, చిన్నారుల కోసం రక్షణ భద్రత చర్యలు చేపట్టాలి. ఏదిఏమైనా ప్రపంచ దేశాలు వారి దేశాల్లో రాజకీయ సుస్థిరతకు పెద్ద పీట వేయాలి. ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు చేపట్టాలి. మతమౌఢ్యం అన్ని దేశాలూ విడనాడాలి. ఉచితాలు, విపరీతంగా ఓట్లు సీట్లు కోసం ప్రజా కర్షక పథకాలు అమలు చేయరాదు. దేశాలు, రాష్ట్రాలు అప్పులు ఊబిలో కూరుకుపోకూడ దు. విద్య, వైద్యం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. స్వయం సమృద్ధి దిశగా ‘లోకల్ టు గ్లోబల్’ వైపు ప్రయాణం చేయాలి. ఎగుమతులు పెంచుకుని, దిగుమతులు తగ్గించుకోవాలి. ఈ విధంగా ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసుకుంటూ చైనా, దక్షిణ కొరియావలే అన్ని దేశాలు స్వయం సమృద్ధి సాధించి ఆయా దేశాల ప్రజల అన్ని రకాల సుస్థిర అభివృద్ధి (సస్టెయండ్ డెవలప్‌మెంట్) కి, మానవ అభివృద్ధి సూచికలో మెరుగైన స్థితిలో ఉండుటకు ఇకనైనా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. తద్వారా మల్టీ డైమెన్షనల్ పేదరికం నుంచి బయటపడటమే వాస్తవ అభివృద్ధి అని గ్రహించాలి. ఎంతో అభివృద్ధి సాధించాము అని చెప్పుకుంటున్న ప్రస్తుత మన పాలకులు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ లో 109 దేశాలను సర్వే జరుపగా, మన దేశం 66వ స్థానంలో ఉండుట గమనార్హం. ఇకనైనా వాస్తవాలు గ్రహించాలి. బీహార్‌లో అత్యధిక ఈ బహుముఖీన పేదరికం తాండవిస్తుంది. అతి తక్కువ పేదరికం కలిగిన రాష్ట్రంగా కేరళ ఉండుట అభినందనీయం. భారత ప్రజల వాస్తవ తలసరి ఆదాయం పెరుగుదలకు, నిజ వేతనాలు పెరుగుటకు ధరలు నియంత్రణతో పాటు ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేయాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి.

ఐ.ప్రసాదరావు
9948272919

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News