న్యూఢిల్లీ : దేశంలోని త్రివిధ సైనిక బలగాలలో దాదాపు 1.35 లక్షల సిబ్బంది కొరత ఉంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ శుక్రవారం లోక్‌సభకు తెలిపారు. అత్యధికంగా పదాతి బలగం ఆర్మీలో 1.18 లక్షల ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయి. భారత నౌకాదళంలో దాదాపు 11,587 భర్తీకాని ఉద్యోగాలు ఉన్నాయి. సెప్టెంబర్ 30 వరకూ ఉన్న స్థితిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. వాయుసేనలో నవంబర్ 1 నాటికి ఎయిర్‌మెన్, పోరాటేతర విభాగాలలో కలిపితే 5,819 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని మంత్రి వివరించారు.
ఆర్మీలో ఖాళీల లెక్కలను ఈ ఏడాది జలై 1 వరకూ పరిగణనలోకి తీసుకుని చూపారు. వీరిలో జూనియర్ స్థాయి అధికారులు, ఇతర ర్యాంకుల వారు ఉన్నారు. ప్రతి ఏటా సగటున చూస్తే త్రివిధ బలగాలలో 60000 వరకూ ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిలో అత్యధికం ఆర్మీలో ఉంటాయి. కోవిడ్ దశలో రెండేళ్లుగా నియామకాల ప్రక్రియ లేకపోవడం వల్ల ఆర్మీలో ఇప్పుడు 1,08,685 మంది జవాన్ల కొరత ఉంది. కోవిడ్ పరిస్థితి నుంచి బయటపడటంతో ఇప్పుడు రిక్రూట్‌మెంట్ తిరిగి ఆరంభం అయింది. త్వరలోనే ఖాళీల భర్తీ క్రమేపీ పూర్తవుతుంది. ఇప్పుడు జవాన్ల స్థాయిలో కేవలం అగ్నిపథ్ స్కీం పరిధిలోనే నియామకాలు చేపట్టారు.