Monday, December 23, 2024

పేదోడి కష్టానికి ‘చెదలు’

- Advertisement -
- Advertisement -

ముక్కలు ముక్కలైన రూ.1.50లక్షల
విలువైన కరెన్సీ నోట్లు

మన తెలంగాణ/ఇల్లందు రూరల్: కూలీ పని చేసుకుని రూపా యి రూపాయీ కూడబెట్టిన ఓ పేద కుటుంబం సొమ్ము చెదలు పాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని బాలాజీనగర్ గ్రామ పరిధిలోని సమ్మ క్క గద్దెల సమీపంలో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులు గడ్డం లక్ష్మయ్య, లక్ష్మిలు తమ రోజువారీ కూలీ సొమ్మును ఓ సూట్‌కేసులో దాచుకునేవారు. లక్ష్మయ్య మేస్త్రీ పనితో రోజు వారీ కూలీగా పనిచేస్తుండగా, లక్ష్మితన ఇంట్లోనే ఎండుమిర్చి తొడిమలు వేరుచేసే పని చేసేది. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు ఇంట్లోని గోడలు నానిపోయి గోడలకు చెదలు పట్టింది.

ఈ క్రమంలో తాము దాచుకున్న సూట్‌కేసుకు సైతం చెద ఉండడాన్ని గమనించిన ఆ దంపతులు సూట్‌కేసు తెరిచి చూడగా దానిలోని దాదాపు లక్షన్నర రూపాయల విలువయిన రూ.2వేల, రూ.5వందల నోట్లు చెద పురుగుల పాలయి ముక్కలు ముక్కలయ్యాయి. దీంతో లబోదిబోమంటూ స్థానిక బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. హైదరాబాద్‌లోని ప్రధాన బ్యాంకు కార్యాలయానికి వెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా బ్యాంకు సిబ్బంది తెలిపినట్లు లక్ష్మయ్య అంటున్నాడు. తమను ఆదుకోవాలని ఆ వృద్ధ దంపతులు కన్పించినవారినల్లా వేడుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News