న్యూఢిల్లీ : ఈ నెల 29 న 1.8 కిలోమీటర్ల వెడల్పైన ప్రమాదకర భారీ గ్రహశకలం భూమికి అత్యంత సమీపానికి రాబోతోంది. ఈ గ్రహశకలం దాని కక్షలో సూర్యుని చుట్టూ భ్రమణం చెందుతూ గంటకు 47,196 వేగంతో భూమికి 40,24,182 కిలోమీటర్ల సమీపం లోకి వస్తుందని అయితే దీనివల్ల భూమికి ఎలాంటి హాని జరగదని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంచనా వేస్తోంది. 1989లో పాలోమర్ అబ్జర్వేటరీ దీన్ని కనుగొన గలిగింది. 1989 జెఎ అని పేరు పెట్టింది. భూ కక్షకు ఇది చేరువ కాగానే బైనాక్యులర్ ద్వారా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1996 లో కూడా ఇది భూమికి 4 మిలియన్ కిలోమీటర్ల సమీపానికి వచ్చింది. భూమి మీదుగా వెళ్తూ సంవత్సరం పొడుగునా సూర్యుని చుట్టూ పరిభ్రమించే అపోలో గ్రహశకలంతో పోల్చుకుంటే దాని తరువాత ఇది అపురూప పరిణామంగా చెబుతున్నారు. మే 29న ఇది భూమికి చేరువగా వచ్చిన తరువాత 2029 సెప్టెంబరులో మళ్లీ భూమికి సమీపంగా వస్తుంది. అదే విధంగా 2055,2062 సంవత్సరాల్లోనూ భూమికి సమీపంగా వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.