న్యూఢిల్లీ: ఈ నెల 16 నుంచి 31వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 191.99 లక్షల (1.92 కోట్ల)డోసుల కొవిడ్19 టీకాలను సరఫరా చేయనున్నట్టు కేంద్ర ఆదోగ్యశాఖ తెలిపింది. వీటిలో 162.50లక్షల డోసుల కొవిషీల్డ్, 29.49లక్షల డోసుల కొవాగ్జిన్ టీకాలుంటాయని పేర్కొన్నది. వీటిని రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపింది. ఈ వ్యాక్సిన్లను 45 ఏళ్లు పైబడినవారితోపాటు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇవ్వాలని కేంద్రం సూచించింది. టీకాల వృథాను అరికట్టేందుకు రాష్ట్రాలకు ముందే సమాచారమిస్తున్నామని, దాంతో కేంద్రం సరఫరా చేసే వ్యాక్సిన్లను నిల్వ ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటారని తెలిపింది.
ఈ నెల 1 నుంచి 15వరకు రాష్ట్రాలకు 1.70 కోట్ల డోసుల టీకాలు పంపినట్టు కేంద్రం తెలిపింది. ఇవేగాక మే నెలలో రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు సొంతంగా 4.39 కోట్ల డోసుల టీకాలు సేకరించుకునేందుకు అనుమతి ఇచ్చామని తెలిపింది. టీకాల కార్యక్రమం చేపట్టి 118 రోజులైందని, శుక్రవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో 17.93 కోట్ల డోసులు పంపిణీ చేశామని తెలిపింది. 114 రోజుల్లో 17 కోట్ల డోసులు పంపిణీ చేసి భారత్ రికార్డు నెలకొలిపిందని తెలిపింది. అదే సంఖ్యలో టీకా డోసుల్ని ఇవ్వడానికి అమెరికాకు 115 రోజులు,చైనాకు 119 రోజులు పట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.