చల్మెడ చెక్‌పోస్ట్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి పట్టివేత నోట్లు తరలిస్తున్న వ్యక్తి కరీంనగర్
బిజెపి కార్పోరేటర్ భర్తగా గుర్తింపు ఆయన ఈటల రాజేందర్ శిష్యుడిగా ప్రకటించిన పోలీసులు
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు అ సెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చల్మెడ చెక్‌పోస్టు వద్ద సోమవారం పోలీసులు, ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆ క్రమంలోనే అటుగా వస్తున్న చొప్పరి వేణు కారు ను సైతం పోలీసులు తనిఖీ నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా కారులో కోటి రూపాయల తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. చొప్పరి వేణు బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్‌కు ప్ర ధాన అనుచరుడని, కరీంనగర్ బిజెపి కార్పొరేటర్ భార్య జయశ్రీ భర్తగా పోలీసులు గుర్తించారు. మునుగోడుకు డబ్బులు తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. వేణును అరె స్ట్ చేసి, కోటి రూపాయల నగదును సీజ్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాపు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో వుంది. ఎన్నికల కోడ్ కారణంగా రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లకూడదు. అయితే కోటి రూపాయల నగదును కారులో తరలిస్తుండడం తో ఈ నగదును సీజ్ చేసి మునుగోడు పోలీస్‌స్టేషన్‌కు పోలీసులు తరలించారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకుగాను భారీగా నగ దు పంపిణీ చేస్తున్నారని రాజకీయ పార్టీలపై ఆరోపణలున్నాయి.
ఈ నియోజకవర్గంలోని మండల స్థాయి నేతలను తమవైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు భారీగా డబ్బులను ఖర్చు చేస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో కొన్ని పార్టీలు భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ తరుణంలో డబ్బులు పట్టుబడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. సోమవారమే నామినేషన్ల ఉపసంహరణకు తెరపడింది. ఈ సమయంలో ఈటల అనుచరుడు చొప్పరి వేణు కారులో కోటి రూపాయలు తరలిస్తూ పోలీసులకు చిక్కడం గమనార్హం. ఈ నెల 7వ తేదీన గూడపూర్ వద్ద కారులో రూ.79 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. నర్సింహ్మా అనే వ్యక్తి హైదరాబాద్‌లో ప్లాట్‌ను విక్రయించగా వచ్చిన డబ్బుగా పోలీసులకు చెప్పారు. దసరాను పురస్కరించుకుని తన స్వగ్రామానికి వచ్చిన సమయంలో ఈ డబ్బులను ఆయన తీసుకువచ్చాడు. హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల క్రితం నాలుగు రోజుల వ్యవధిలో రూ.10 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. హవాలా రూపంలో నగదును తరలిస్తున్న సమయంలో పోలీసులు సీజ్ చేశారు.