వాహనాలు అదుపు తప్పి భీభత్సం సృష్టించడంతో ఒకరు మృతి చెందగా, పాఠశాల విద్యార్థులు గాయపడిన సంఘటనలు సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం….కరీంనగర్ జిల్లా, గన్నేరువరం గ్రామానికి చెందిన మునిగంటి కరుణాకర్(45) డిసిఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 28వ తేదీన గ్రానైట్ లోడ్ తీసుకుని హైదారబాద్‌కు వచ్చాడు. గ్రానైట్‌ను మౌలిలో అన్‌లోడ్ చేసి, కోకాపేటలోని మూవీ టవర్స్ వద్ద స్క్రాప్‌ను లోడ్ చేసుకునేందుకు 29వ తేదీన వెళ్లాడు.
అక్కడ లేబర్ లేకపోవడంతో డిసిఎం లోడ్ కాలేదు, లోడ్ చేసుకునేందుకు వేచి ఉన్నాడు. ఈ సమయంలోనే అక్కడ టిప్పర్ కరుణాకర్‌ను ఢీకొట్టి తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ కుటుంబానికి పోలీసులు ఫోన్ చేసి మృతిచెందిన విషయం చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హైదరాబాద్, ఎర్రగడ్డ ఏజీ కాలనీలో కారు భీభత్సం సృష్టించింది. అతివేగం, అజాగ్రత్తతో కారును నడపడంతో డివైడర్‌పైకి దూసుకెళ్లడంతో పలువురికి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న మధురానగర్ పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.