Monday, December 23, 2024

రోజుకు లక్ష మంది , 70 వేల కార్లు

- Advertisement -
- Advertisement -

వీడ్కోలు ఇచ్చే వారితో కిక్కిరిసిపోతోన్న శంషాబాద్ విమానాశ్రయం

మన తెలంగాణ/హైదరాబాద్ : విదేశాలకు వెళ్లే విద్యార్ధులు వారికి సెండాఫ్ ఇవ్వడానికి వస్తున్న తల్లిదండ్రులు, బంధుమిత్రులతో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం కిక్కిరిసిపోతోంది. గడిచిన వారం పది రోజులుగా రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి రోజుకు 5000 మంది విద్యార్ధులు విదేశాలకు వెళ్తున్నారు. వీరికి సెండాఫ్ ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు భారీగా తరలివస్తున్నారు. రోజుకు కనీసం లక్షమంది ఇలా వస్తుండటంతో వీరిని నియంత్రించడం భద్రతా సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. దీనికి తోడు ఎయిర్‌పోర్ట్‌కు దాదాపు 70 వేల కార్లు వస్తుండటంతో ఆ మార్గంలో విపరీతంగా ట్రాఫిక్ జాం అవుతోంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెండాఫ్ ఇచ్చేందుకు ఒక విద్యార్ధి వెంట నలుగురిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.

ఒక్కో ప్రయాణీకుడి వెంట 10 నుంచి 15 మంది రావడంతో ఎయిర్‌పోర్టులో రద్దీ పెరిగి భద్రత, పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు.. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సీఐఎస్‌ఎఫ్, స్టేట్ పోలీసుల భద్రతను పెంచారు. విమానాశ్రయానికి వచ్చే ప్రతి వాహనాన్ని, ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఆగస్ట్ 28 వరకు సందర్శకులకు పాసుల జారీని అధికారులు రద్దు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News