Wednesday, November 6, 2024

అకాడమీ నిధుల గల్లంతు కేసులో 10మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

10 arrested in Telugu Academy case

అకాడమీ నిధుల గల్లంతు కేసులో 10 మంది అరెస్ట్
మరో తొమ్మిది మంది కోసం వేట సాగిస్తున్నాం
నిధులు విడతల వారీగా విత్‌డ్రా చేసిన నిందితులు
అకాడమీలో కొందరికి నిందితుల కమీషన్ల ఎర
ఈ స్కాంలో కీలక నిందితుడు సాయికుమార్
రియల్ ఎస్టేట్‌లో నిందితుల పెట్టుబడులు
సిపి అంజనీకుమార్ వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.50 కోట్ల వరకు నిధుల గల్లంతు కేసులో ఇప్పటి వరకు 10 మంది నిందితులను అరెస్ట్ చేశామని, మరో తొమ్మిది మంది నిందితుల కోసం వేటసాగిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ నిధులు గల్లంతు కేసు వివరాలను బుధవారం నాడు సిపి తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా సిపి అంజనీకుమార్ మాట్లాడుతూ తెలుగు అకాడమీ నిధులు యూనియన్ బ్యాంక్ ద్వారా దారి మళ్లినట్లు సెప్టెంబర్ 27న ఫిర్యాదు రావడంతో ఈ స్కాంలో మూడు కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి విచారించామన్నారు.

దాదాపు రూ.64.50 కోట్ల వరకు నిధుల గోల్‌మాల్ జరిగిందని, గత ఏడాడి డిసెంబర్ నుంచి ఇప్పటివరకు విడతలవారీగా నిధులను నిందితులు డ్రా చేశారన్నారు. ఈ కేసులో అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్, చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన, రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటకోటి సాయికుమార్‌లను అరెస్ట్ చేశామని, ఈ స్కాంలో సాయికుమార్ ప్రమేయం చాలా కీలకంగా ఉందని, ఈ కేసులో కీలక పాత్ర వహించిన మరో 9 మంది అనుమానితుల కోసం వేట కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కేసులోని కీలక నిందితుడు సాయికుమార్ 2015 ఎపి హౌసింగ్ బోర్డ్ స్కాంలోనూ సిఐడి విచారించిందన్నారు. అదేవిధంగా మరో రూ.25 కోట్ల మోసం కేసులో సాయికుమార్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారని సిపి వివరించారు.

అకాడమీ సిబ్బందికి కమీషన్ల ఎర..:

తెలుగు అకాడమీ కుంభకోణంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీతో ఏజెంట్లు నండూరి వెంకట్, సాయి, వెంకట్ కుమ్మక్కై కమీషన్లు ఇస్తామంటూ అకాడమీ సిబ్బందిని ముగ్గులోకి దింపినట్లు తేలింది. ఈ కేసులో కెనరా బ్యాంక్ చందానగర్ బ్రాంచ్ మేనేజర్ సాధనను అరెస్ట్ చేసిన సిసిఎస్ మరోవైపు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ ఆలీని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈక్రమంలో మస్తాన్‌ఆలీకి సన్నిహితులైన ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేశారు. ఈకేసు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ ఆలీ చుట్టూ తిరుగుతోందని, ముఖ్యంగా యూనియన్ బ్యాంకుకు చెందిన కార్వాన్ బ్రాంచ్ నుంచి రూ.43 కోట్లు, సంతోష్ నగర్ శాఖలో రూ.12 కోట్లు, చందానగర్ అకౌంట్ నుంచి రూ.10 కోట్లను విడతలవారీగా ఎపి మర్కంటైల్ సొసైటీ బ్యాంక్‌కు మళ్లించి సొమ్ము చేసుకున్నారని సిపి వివరించారు.అకాడమీ అకౌంట్ల నుంచి వ్యక్తిగత ఖాతాల్లోకి తరలించారని, ఈ కేసులో మిగతా సొమ్ముకు సంబంధించి మరో ఎనిమిది మందిపై అనుమానం ఉందని వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామన్నారు. ప్రస్తుతం అరెస్టయిన వారిని కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు రాబడతామని సిపి వివరించారు.

ఏడాది నుంచి కుట్ర 

తెలుగు అకాడమీలోని నిధులను కాజేసేందుకు నిందితుల ఏడాది క్రితం నుంచే కుట్ర పన్నారని విచారణలో తేలిందని సిపి తెలిపారు. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్‌తో కలిసి డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారని, ఇందులో భాగంగా అకాడమీ నుంచి 3 బ్యాంకుల్లో డిపాజిట్లకు సిఫార్సు చేశారన్నారు. బ్యాంకుల డిపాజిట్ల సందర్భంలోనే నకిలీ పత్రాలు, డైరెక్టర్, అకౌంట్ ఆఫీసర్ సంతకాలు ఫోర్జరీ వంటి అంశాలను సెట్ చేసుకున్నారని, సంవత్సర కాలానికి డిపాజిట్లు పెట్టి 15 రోజులకే మార్పు చేశారన్నారురు. నిందితులు ఒరిజినల్ డిపాజిట్ల సర్టిఫికెట్లు తమ దగ్గరే ఉంచుకుని నకిలీ సర్టిఫికెట్లు అకాడమీకి ఇచ్చారన్నారు. ఈక్రమంలోనే ఒరిజినల్ ఎఫ్‌డిలతో రూ. 64.5 కోట్ల రూపాయలు ఈ ముఠా డ్రా చేసిందని తెలిపారు. కుట్రంలో భాగంగా ముందుగానే తెలుగు అకాడమీ పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేశారన్నారు.

అగ్రసేన్, ఎపి మర్కంటైల్ సొసైటీల్లో నకిలీ ఖాతాలు సృష్టించి యూనియన్, కెనరా బ్యాంకుల్లో కాజేసిన నిధులను ముందుగా అగ్రసేన్ బ్యాంక్‌కు తరలించారని వివరించారు. తర్వాత మర్కంటైల్ సొసైటీకి మళ్లించి 64.5 కోట్ల రూపాయలు డ్రా చేశారని, ఇందులో రూ.6 కోటను బ్యాంకు మేనేజర్లు, సొసైటీ సిబ్బందికి లంచంగా ఇచ్చారన్నారు. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్‌కు కోట్ల రూపాయల లంచం ఇచ్చిన ఈ ముఠా మిగిలిన మొత్తాలను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారని తెలిపారు. ఈక్రమంలో ఈ స్కాంలోని కొందరు నిందితులు కాజేసిన నిధులతో అప్పులు తీర్చుకున్నారని, మరికొందరు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చినట్లు విచారణలో వెళ్లడయ్యిందన్నారు.

సాయికుమార్ కీలక ప్రాత 

అకాడమీ నిధుల గల్లంతులో రియాల్టర్ సాయికుమార్ కీలక పాత్ర పోషించినట్లు విచారణలో తేలిందని సిపి వివరించారు. సాయికుమార్ తెలుగు అకాడమీ వ్యవహారంలో తెర వెనుక ఉండి మొత్తం కథ నడిపించాడన్నారు. కొల్లగొట్టిన నగదులోనూ అధిక శాతం ఇతనే తీసుకున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని .పశ్చిమ గోదావరికి చెందిన వెంకటరామన్ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, పెట్టుబడులు పెట్టేందుకు డబ్బు అవసరం రావడంతో సాయికుమార్‌తో కలిసి బ్యాంకుల్లో ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లు కొల్లగొట్టాలని కుట్ర పన్నినట్లు తేలిందన్నారు. గతంలో సాయికుమార్ ఎపి మైనార్టీ సంక్షేమ సంఘం, ఎపి హౌసింగ్ బోర్డు కుంభకోణం, చెన్నైలో మరో కేసులో నిందితుడిగా ఉన్నాడన్నారు.

ఈ క్రమంలో తెలుగు అకాడమీకి అకౌంట్స్ ఇంఛార్జి రమేశ్‌కు బ్యాంకు ఏజెంట్ సాయికుమార్‌కు పరిచయమయ్యాడని, అకాడమీకి చెందిన నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు సాయికుమార్‌కు చెక్కుల రూపంలో రమేశ్ ఇచ్చేవాడన్నారు. వాటిని తన అనుచరులతో కలిసి నకిలీ ఎఫ్‌డిఆర్ పత్రాలు సృష్టించి బ్యాంకులో డిపాజిట్ చేశామని నమ్మబలికేవారని, ఈ వ్యవహారమంతా రమేశ్‌కు ముందుగానే చెప్పి అతని కూడా కమీషన్ ఇచ్చినట్టు విచారణలో తేలిందన్నారు. అకాడమీలోని ఉన్నతాధికారులకు తెలియకుండా రమేశ్ ఈ తతంగమంతా నడిపాడని, బ్యాంకు అధికారుల సహాయంతో నకిలీ డిపాజిట్ పత్రాలను సృష్టించి అకాడమీ ఉన్నతాధికారులను నమ్మించాడన్నారు. వీరికి యూబిఐ బ్యాంకు మేనేజర్ మస్తాన్‌వలీ, కెనరా బ్యాంకు మేనేజర్ సహకరించారని, ఇందుకు వారికి సైతం కమీషన్లు ముట్టినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News