Sunday, December 22, 2024

రెండు హెలికాప్టర్లు ఢీకొని 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మలేసియా నావికా దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు మంగళవారం గగనతలంలో ఢీకొనడంతో 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మలేసియాలో ఏప్రిల్ 26న జరగనున్న రాయల్ మలేసియన్ నేవీ 90 వ వార్షికోత్సవం పురస్కరించుకుని పెరక్ లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం ఉదయం హెలికాప్టర్లతో శిక్షణ విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘోర ప్రమాదం సంభవించింది. గుర్తింపు కోసం మృతుల అవశేషాలను ఆస్పత్రికి పంపామని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. అనేక హెలికాప్టర్లు పడంగ్ సితియా వాన్ నుంచి గగనతలం లోకి వెళ్లగా, వాటిలో ఒకటి పక్కకు ఒరిగి మరో హెలికాప్టర్ తాలూకు రోటార్‌కు చిక్కుకుంది. దీంతో రెండు హెలికాప్టర్లు ఢీకొని కుప్ప కూలాయి. వీడియో దృశ్యాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఒక హెలికాప్టర్ విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోగా, మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది.

రెండు హెలికాప్టర్లు గుర్తు పట్టలేనంతగా చిన్నాభిన్నం అయ్యాయి. అయినప్పటికీ మృతదేహాలను గుర్తించడానికి సహాయ సిబ్బంది శిధిలాలను జల్లెడపట్టారు. హృదయాన్ని, ఆత్మను కదిలించే ఈ విషాద సంఘటనకు యావద్దేశం సంతాపం తెలుపుతోందని ప్రధాని అన్వర్ ఇబ్రహిం విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై నేవీ తక్షణం దర్యాప్తు జరుపుతుందని పేర్కొన్నారు. రెండు హెలికాప్టర్లతో ఒకటి ఎడబ్లు 139 మారిటైమ్ ఆపరేషన్ హెలికాప్టర్ కాగా, ఇందులో ఏడుగురు నేవీ సిబ్బంది ఉన్నారు. దీన్ని అగస్టావెస్ట్‌లాండ్ తయారు చేసింది. మరో హెలికాప్టర్ ఫెన్నెక్ తేలికపాటి హెలికాప్టర్. ఐరోపా బహుళ జాతి రక్షణ సంస్థ దీన్ని తయారు చేసింది. ఇందులో ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారు. ఇటీవల జపాన్ లోనూ ఇదే తరహ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత శనివారం అర్ధరాత్రి ప్రత్యేక శిక్షణ కోసం వెళ్లిన రెండు నౌకాదళ హెలికాప్టర్లు ఢీకొని సముద్రంలో కుప్ప కూలాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News