Friday, January 24, 2025

7 రాష్ట్రాలలో వర్ష బీభత్సం.. 32 మంది మృతి, 50మంది గల్లంతు

- Advertisement -
- Advertisement -

వయనాడ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
1000 మందిని రక్షించిన సైన్యం
వయనాడ్‌ను సందర్శించిన రాహుల్, ప్రియాంక

న్యూఢిల్లీ: దేశంలోని అనేక రాష్ట్రాలలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఏడు రాష్ట్రాలలో కురిసిన భారీ వర్ష్లాలు 32 మందిని బలిగొనగా అనేక మంది వరదల్లో గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన కుంభవృష్టికి 14 మంది మరణించగా 50 మందికి పైగా గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్‌లో 10 మంది మృతి చెందగా హిమాచల్ ప్రదేశ్‌లో నలుగురు మరణించారు. ఢిల్లీలో ఐదుగురు, ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నాయిడాలో ఇద్దరు, హర్యానాలోని గురుగ్రామ్‌లో ముగ్గురు, రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగ్గురు, బీహార్‌లో ఐదుగురు వర్షాల కారణంగా ఏర్పడిన విపత్తులలో మరణించినట్లు వార్తలు అందుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కురిసి వరదలు ముంచెత్తడంతో 40 మంది గల్లంతయ్యారు.

ఉత్తరాఖండ్‌లో కూడా పలువురు గల్లంతైనట్లు సమాచారం. దీంతో ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 283కి చేరుకుంది. కేరళలోని వయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలలో 256 మంది మరణించారు. వయనాడ్‌లోని మేప్పడి సమీపంలోగల కొండ ప్రాంతాలలో మంగళవారం భారీ వర్షాల కారణంగా మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. గురువారం కూడా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతుండగా వందలాది మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరావడం లేదు. భారతీయ సైన్యం దాదాపు 1,000 మందిని రక్షించగా ఇంకా 220 మంది ఆచూకీ తెలియరాలేదు. బాధితులను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించామని, సాధ్యమైనంత త్వరలో పునరావాస చర్యలు చేపడతామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, వయనాడ్ మాజీ ఎంపి రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలసి గురువారం మధ్యాహ్నం వయనాడ్‌లోని కొండచరియల తాకిడికి గురైన చూరల్‌మలా ప్రాంతాన్ని సందర్శించారు. భారీ వర్షంలోనే తడుస్తూ వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మేప్పడిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి బాధితులను పరామర్శించారు. అక్కడి నుంచి డాక్టర్ మూపెన్స్ మెండికల్ కాలేజ్‌ను, రెండు సహాయ శిబిరాలను వారిద్దరూ సందర్శించి బాధితులను పరామర్శించారు. వారి వెంట ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, అళప్పుళ ఎంపి కెసి వేణుగోపాల్ ఉన్నారు. ఉదయం 9.30 గంటలకు కన్నూర్ విమానాశ్రయంలో దిగిన రాహుల్, ప్రియాంక అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వయనాడ్ చేరుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News