న్యూఢిల్లీ: సరైన టికెట్లు ఉన్నప్పటికీ ప్రయాణికులను విమానంలోకి అనుమతించనివ్వకపోవడంతోపాటు వారికి చట్టపరంగా చెల్లించాల్సిన పరిహారాన్ని చెల్లించనందుకు ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా విధించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) మంగళవారం తెలిపింది. ఈ సంఘటన అనంతరం బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాల్లో వరుసగా తనిఖీలు, నిఘాలు నిర్వహించగా ప్రయాణికులకు పరిహారం చెల్లించడంలో ఎయిర్ ఇండియా నిబంధనలను పాటించడం లేదని బయటపడిందని, దీనిపై ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీచేయడం జరిగిందని డిజిసిఎ ఒక ప్రకటనలో తెలిపింది. సరైన టికెట్ ఉండి విమానశ్రయంలో సరైన సమయానికి రిపోర్ట్ చేసినప్పటికీ ప్రయాణికుడిని విమానంలోకి అనుమతించని పక్షంలో డిజిసిఎ నిబంధనల ప్రకారమే ఏ ఎయిర్‌లైన్స్ అయినా వ్యవహరించవలసి ఉంటుంది. ఒక గంటలోపల బాధిత ప్రయాణికుడికి ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసిన పక్షంలో ఆ ప్రయాణికుడికి నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం ఉండదు. అయితే.. 24 గంటల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన పక్షంలో బాధిత ప్రయాణికుడికి రూ. 10 వేల నష్టపరిహారాన్ని ఎయిర్‌లైన్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 24 గంటలు దాటితే రూ.20 వేల పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
10 lakh fined to Air India for Boarding Despite