Friday, January 24, 2025

యువతకు 10 లక్షల ప్రభుత్వోద్యోగాల కల్పన: ప్రధాని

- Advertisement -
- Advertisement -

ఏడాదిన్నరలో ఆ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం
71 వేల మందికి పైగా ఉద్యోగ నియామక పత్రాలు
రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోడీ వెల్లడి
న్యూఢిల్లీ : గడచిన ఏడాది లేదా ఏడాదిన్నర కాలంలో యువజనులకు రమారమి పది లక్షల శాశ్వత ప్రభుత్వోద్యోగాలను తమ ప్రభుత్వం కల్పించిందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వెల్లడించారు. పరోక్షంగా ఒక రోజ్‌గార్ మేళాలో రిక్రూట్‌లను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, పూర్వపు ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ ఆ విధంగా ‘మిషన్ పద్ధతి’లో ఉద్యోగాల కల్పన జరగలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో 71 వేల మందికి పైగా వ్యక్తులకు నియామక పత్రాలు అందజేశారు. యువ జనాభా తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలకు కేంద్రం అని ఆయన పేర్కొన్నారు. నిజాయతీ, పారదర్శకత నియామక ప్రక్రియకు ఆధారంగా ఉన్నాయని మోడీ చెప్పారు. కొత్త నియుక్తులలో అధిక సంఖ్యాకులు మహిళలని మోడీ తెలియజేశారు. వారు ప్రతి రంగంలో స్వావలంబన సాధించాలన్నది తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు. మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వారి కెరీర్‌లో ఎంతో ఉపయుక్తంగా ఉందని ఆయన తెలిపారు. ‘పిఎం ఆవాస్ యోజన’ కింద నిర్మించిన ఇళ్ల యజమానుల్లో అధిక సంఖ్యాకులు మహిళలే అని ప్రధాని చెప్పారు. దేశంలో మహిళా వికాసం చోటు చేసుకుంటున్నదని ఆయన చెప్పారు. భారతీయ యువజనుల సామర్థాలను, ప్రతిభను గరిష్ఠంగా వినియోగించుకోవడం తమ ప్రభుత్వ ప్రాథమ్యం అని మోడీ తెలియజేశారు. స్టార్టప్ భారత్, డిజిటల్ భారత్ లేదా రోదసి, రక్షణ రంగాల్లో సంస్కరణలు వంటి పలు పథకాలకు వారే కేంద్రమని ఆయన పేర్కొన్నారు.

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) యువజనుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నదని ఆయన చెబుతూ, ఈ విషయంలో మాతృభాష వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉద్ఘాటించారు. యువజనులు 13 భారతీయ భాషల్లో నియామక పరీక్షలు రాయగలిగేందుకు భాష అడ్డుగోడ కాకుండా తమ ప్రభుత్వం చూసిందని ప్రధాని తెలిపారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ గ్రామీణ భారతం అభివృద్ధి కోసం, దేశ ప్రగతి కోసం పాటుపడ్డారని మోడీ పేర్కొంటూ, గ్రామాల్లో స్వయం ఉపాధి అవకాశాల కల్పన, ఉద్యోగాల సృష్టి ద్వారా తమ ప్రభుత్వం ఆయన విధానాన్ని అనుసరించిందని తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, కొత్తగా నియమించిన 71 వేల మందిలో 29 శాతం మందికి పైగా ఒబిసి కేటగరీకి చెందినవారని తెలియజేశారు. వెనుకబడిన తరగతుల వారి నియామకం యుపిఎ హయాంలో కన్నా మోడీ ప్రభుత్వ హయాంలో 27 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఆయన తెలిపారు. సోమవారం నియుక్తుల్లో ఎస్‌సిలు 15.8 శాతం మంది, ఎస్‌టిలు 9.6 శాతం మంది ఉన్నారని జితేంద్ర సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News