Monday, December 23, 2024

ఏడాదిన్నరలో 10లక్షల కొలువులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల నియామకాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ( పిఎంఓ) మంగళవారం ట్వీట్ చేసింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో మానవ వనరుల స్థితిగతులను సమీక్షించిన తర్వాత మోడీనుంచి ఈ కీలక ప్రకటన వచ్చింది.‘ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో మానవ వనరుల స్థితిగతులను ప్రధాని మోడీ సమీక్షించారు. అనంతరం 10 లక్షల నియామకాలపై ఆదేశాలు ఇచ్చారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో ఈ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వ శాఖలకు దిశానిర్దేశం చేశారు’ అని పిఎంఓ పోస్టు పెట్టింది. దేశంలోని నిరుద్యోగ సమస్యపై విఓక్షాలు ఇటీవలి కాలంలో తరచూ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ 10 లక్షల పోస్టులను రాబోయే ఏడాదిన్నర కాలంలో భర్తీ చేస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడానికి అధికార బిజెపికి బలమైన ఆయుధం దొరికినట్లవుతంది. కాగా పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంపై బిజెపి ఎంపి వరుణ్ గాంధీ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెబుతూనే కేంద్రం చేసిన హామీలను మరోసారి గుర్తు చేశారు. ఇప్పటికే మంజూరై ఖాళీగా ఉన్న కోటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని కోరిన ఆయన ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు వేగవంతమైన చర్యలను కూడా తీసుకోవాలని కోరారు. వరుణ్ గాంధీ కమలం పార్టీ ఎంపి అయినప్పటికీ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News