Monday, December 23, 2024

పదిమందితో కొలువుదీరిన పంజాబ్ కేబినెట్

- Advertisement -
- Advertisement -

10 Ministers Take Oath In Punjab

మంత్రులుగా మహిళ డాక్టర్ కౌర్, దళిత నేత చీమా

చండీగఢ్ : పంజాబ్‌లో ఆప్ మంత్రివర్గం కొలువుతీరింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నాయకత్వంలోని ప్రభుత్వంలో శనివారం పది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా మాన్ ప్రమాణం చేశారు. శనివారం కేబినెట్ కూర్పులో భాగంగా పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరితో ప్రమాణం చేయించారు. వీరంతా పంజాబీభాషలోనే తమ ప్రమాణ పత్రాలు చదివారు. ఇప్పుడు మంత్రులు అయిన వారిలో హర్పాల్ సింగ్ చీమా, గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ మినహా మిగిలిన ఎనమండుగురు తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వారే.

వీరిలో చీమా దిర్బా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రిగా డాక్టర్ బల్జీత్ కౌర్ ఉన్నారు. ఆమె మలౌత్ స్థానం నుంచి గెలిచారు. కేబినెట్‌లో 18 మంది వరకూ మంత్రులను తీసుకోవచ్చు. అయితే ముందు పది మందితో మంత్రివర్గం ఏర్పాటు అయింది. ఇప్పటికైతే మాన్ మంత్రిమండలి స్వల్పస్థాయి కేబినెట్‌గానే నిలిచింది. ఇక ముందు ఎవరెవరిని తీసుకుంటారనేది తరువాత తేలనుంది. ఇప్పుడు కొలువుదీరిన మాన్ మంత్రివర్గంలో ఓ డాక్టర్ ఓ లాయర్ ఓ ధాన్యం మార్కెట్ ఏజెంట్ ఉన్నారు. ఇప్పుడు మంత్రి అయిన హర్పాల్ సింగ్ చీమా ప్రముఖ దళితనేత. ఆప్‌లో పార్టీ స్థాపన నుంచి ఉంటూ వస్తున్నారు. కీలక పాత్ర పోషించారు.

ప్రమాణ ఘట్టానికి బండారు దత్తాత్రేయ

మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా వచ్చారు. సిఎం భగవంత్ మాన్, ప్రొటెమ్ స్పీకర్ డాక్టర్ ఇందర్‌బీర్ సింగ్ నిజ్జర్, ఆప్ ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులు ఇతరులు హాజరయ్యారు. ఢిల్లీ తరువాత కీలకమైన పంజాబ్‌లో ఆప్ తన అధికార పాగా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News