మన తెలంగాణ, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం టిఎస్‌పీఎస్పీని ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రశ్నా పత్రాల లీకేజీకి దారి తీసిన పరిస్థితులు సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఉపక్రమించింది. అందులో భాగంగానే కమిషన్‌లో ఖాళీగా ఉన్న కీలక పోస్టులను భర్తీ చేయడమే కాకుండా పనిభారం తగ్గించడం, పని విభజన చేసి జవాబుదారి తనం పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కమిషన్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడమే కాకుండా కొత్తగా 10 కీలకమైన పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
కమిషన్ చరిత్రలోనే మొదటిసారిగా కంట్రోలర్ ఆప్ ఎగ్జామినేషన్ విభాగానికి ఒక ఐఎఎస్ అధికారిని నియమించడంతో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ప్రతిష్టను పెంచేందుకు ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, ముఖ్య సమాచార అధికారి, ముఖ్య సమాచార సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్, జూనియర్ నెట్‌వర్క్, ఆడ్మినిస్ట్రేటర్, సీనియర్, జూనియర్ ప్రొగ్రామర్ పోస్టులు, జూనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో లా ఆపీసర్ పోస్టులకు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి వెంటనే ప్రభుత్వం అమోద ముద్ర వేసి కొత్త పోస్టులకు మంజూరు చేసింది.
పరీక్షల కంట్రోలర్‌గా బీఎం సంతోష్
టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శిగా ఐఎఎస్ అధికారి బి. ఎం. సంతోష్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతలను నుంచి ఆయనను బదిలీ చేసింది. సంతోష్ టిఎస్‌పిఎస్సీ పరీక్షల కంట్రోల్‌గా వ్యవహరించనున్నారు. త్వరలో కమిషన్‌లో పలు ఉద్యోగాలకు చెందిన పరీక్షలు తేదీలు ఖరారు చేయనున్నారు.