Tuesday, December 17, 2024

విదేశీ బొగ్గు షాక్

- Advertisement -
- Advertisement -

థర్మల్ కేంద్రాల్లో 10% విదేశీ బొగ్గు వాడాలని కేంద్రం మెలిక

ఇప్పటికే బొగ్గు కొనుగోలుకు 4 రెట్లు అధిక ధర చెల్లిస్తున్న జెన్‌కో
విదేశీ బొగ్గు కొంటే మరింత భారం

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నేపథ్యంలో బొగ్గు కొనుగోలుకు నాలుగు రెట్ల అధిక చెల్లించాల్సి వస్తోందని రాష్ట్ర జెన్‌కో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సింగరేణితో పాటు ఇతర గనుల నుంచి టన్నుకు సగటున రూ.4,600ల నుంచి రూ.5,000లు పెట్టి బొగ్గును కొనుగోలు చేస్తున్నామని వారు పేర్కొంటున్నారు. దీనికితోడు విదేశీ బొగ్గును కొనుగోలు చేయాలంటే కనీసం నాలుగైదు రెట్లు అధికంగా డబ్బును వెచ్చించాల్సి ఉంటుందని జెన్‌కో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది ఆర్థికంగా భారమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థర్మల్ కేంద్రాలకు రోజూ 50 వేల టన్నుల బొగ్గు ఒక్కసారిగా ఉన్న ధరకు నాలుగు రెట్లు అధికంగా చెల్లించి బొగ్గు కొనుగోలు చేయాలంటే ఎలా సాధ్యమని జెన్‌కో సంస్థల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కరెంట్ యూనిట్ సగటు సరఫరా వ్యయం రూ.7.14కి చేరగా దానికితోడు విదేశీ బొగ్గును తెప్పిస్తే అది రూ.9ల నుంచి 10లకు చేరుకుంటుందని వారు పేర్కొంటున్నారు. తెలంగాణ థర్మల్ కేంద్రాలకు రోజూ 50 వేల టన్నుల బొగ్గును వినియోగిస్తుండగా దీనికి పదిశాతం విదేశీ బొగ్గును కొనుగోలు చేయాలంటే కనీసం ఐదువేల టన్నుల బొగ్గును కొనాల్సి ఉంటుందని జెన్‌కో అధికారులు పేర్కొంటున్నారు.

దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నేపథ్యంలో..

విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో పలు రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. సాధారణంగా ప్రతి ఏడాది వేసవికాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. దానికితోడు ఇటీవల పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో పరిశ్రమలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేశాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగిపోవడంతో అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ వాడకం పెరిగింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడడంతో విదేశీ బొగ్గు వాడకం ఎక్కువయ్యింది.

రాష్ట్రంలో 10 నుంచి 15 రోజులకు సరిపడా నిల్వలు…

దేశంలో బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం ముందస్తు ప్రణాళికలు చేపట్టకపోవడంతో అన్ని రాష్ట్రాలకు బొగ్గు కొరత ఏర్పడింది. ఎపితో పాటు పలు రాష్ట్రాల్లో ఒకటి నుంచి రెండు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండగా తెలంగాణలో మాత్రం వివిధ ప్రాంతాల్లో 10 రోజుల నుంచి 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని జెన్‌కో అధికారులు పేర్కొంటున్నారు. అయితే కేంద్రానికి సరైన ప్రణాళికలు లేకపోవడంతో వివిధ రాష్ట్రాలు విదేశీ బొగ్గుపై ఆధారపడుతున్నాయని రాష్ట్ర జెన్‌కో అధికారులు పేర్కొంటున్నారు. స్థానికంగా బొగ్గు గనులున్న రాష్ట్రాల్లోని జెన్‌కోలకు కూడా విదేశీ బొగ్గు కొనమని కేంద్రం చెప్పడంపై ఆయా రాష్ట్రాల అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే అన్ని రాష్ట్రాల థర్మల్ కేంద్రాలు 10 శాతం విదేశీ బొగ్గు కొనాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వడంపై రాష్ట్ర జెన్‌కో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జెన్‌కోపై గతేడాది రూ.400 కోట్ల అదనపు భారం

బొగ్గును రైళ్లలో సరఫరా చేస్తుండగా రైళ్ల కొరత వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ కేంద్రాలకు సరఫరా తగ్గి కొరత నానాటికీ పెరుగుతోందని కేంద్ర విద్యుత్ మండలి తాజాగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే దేశీయ బొగ్గు ధరలు, గూడ్సు రైళ్ల రవాణా ఛార్జీలు పెంచడం వల్ల తెలంగాణ జెన్‌కోపై గతేడాది రూ.400 కోట్ల అదనపు భారం పడింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతమున్న ధరలకు విదేశీ బొగ్గు కొంటే ఉత్పత్తి వ్యయం పెరిగి సంస్థలు సంక్షోభంలో కూరుకుపోతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News