చండీగఢ్ : పంజాబ్ రాష్ట్రంలో 50 శాతం ఓటర్లున్న మహిళలకు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 10 శాతం మందికి మాత్రమే రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చాయి. మహిళల ఓట్లను పొందడానికి ప్రయత్నిస్తున్న పార్టీలు వారికి ఓటర్ల సంఖ్య ప్రాతిపదికగా ప్రాతినిధ్యం కల్పించడంలో విఫలమయ్యారు. పంజాబ్ రాష్ట్రంలో మొత్తం 2.77 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 1.31 కోట్ల మంది మహిళలు ఉన్నారు. పంజాబ్‌లో మహిళలను ఓటర్లుగా చూస్తున్నారు తప్ప వారికి సీట్లు మాత్రం వారి జనాభా దామాషాలో కేటాయించడం లేదు. తాము గెలిస్తే మహిళలకు రూ. 1000 నుంచి 2 వేల వరకు నెలవారీ నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని పార్టీలు హామీలు ఇచ్చాయి. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి మహిళలకు వెయ్యి రూపాయల నగదు ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది.
కాగా తాము నెలకు రూ. 2 వేలు ఇస్తామని కాంగ్రెస్ అకాలీదళ్ పార్టీలు ప్రకటించాయి. తాము 8 ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లను ఇస్తామని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ ప్రకటించారు. 117 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ 11 మంది మహిళలకు, ఆప్ 12 మంది మహిళలకు , బీజేపీ పీఎల్‌సీఎస్‌ఎడి (సంయుక్త్) కూటమి ఎనిమిది మందికి, ఎస్‌ఎడిబీఎస్‌పి కూటమి కేవలం ఐదుగురు మహిళలకు మాత్రమే టికెట్లు ఇచ్చింది. మహిళలకు కనీసం 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ 9.40 శాతం మందికి మాత్రమే టికెట్లు ఇచ్చింది. అయితే ఆప్ 10.25 శాతం మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. 127 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే పంజాబ్‌లో ఆప్ అత్యధిక సంఖ్యలో మహిళలను రంగం లోకి దించిందని ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన అన్మోల్ గగన్ మాన్ చెప్పారు.