Monday, December 23, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు 10% జీతాలు కట్!

- Advertisement -
- Advertisement -

పాక్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు 10% జీతాలు కట్!
పొదుపు చర్యల్లో భాగంగా మంత్రిత్వ శాఖల ఖర్చుల్లోనూ కోత
జియో న్యూస్ కథనం వెల్లడి
ఇస్లామాబాద్: ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో నిండా కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులుందరికీ వేతనాల్లో 10 శాతం కోత విధించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు జియో న్యూస్ కథనం పేర్కొంది. విదేశీ ద్రవ్య నిల్వలు దాదాపుగా అడుగంటిపోవడంతో పాకిస్థాన్ ఇటీవలి సంవత్సరాల్లో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని ఫెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని జాతీయ పొదుపు చర్యల కమిటీ( నేషనల్ ఆస్టరిటీ కమిటీ) ప్రభుత్వ ఉద్యోగులుందరికీ 10 శాతం జీతాల కోతతో పాటుగా పలు చర్యలను పరిశీలిస్తోందని జియో న్యూస్ తెలిపింది. మంత్రిత్వ శాఖలు, విభాగాల ఖర్చులను 15శాతం తగ్గించడంతో పాటుగా సలహాదారుల సంఖ్యను 78నుంచి 30కి తగ్గించాలని, మిగతా వారు జీతం లేకుండా పని చేసే విషయాన్ని కూడా కమిటీ పరిశీలిస్తోందని ఆ కథనం పేర్కొంది. కమిటీ సిఫార్సులను బుధవారం ఖరారు చేస్తుందని, అనంతరం నివేదికను ప్రధానమంత్రికి పంపించడం జరుగుతుందని ఆ కథనం పేర్కొంది.

పాక్ ప్రభుత్వం మరో విడత అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) రుణం కోసం ప్రయత్నిస్తున్న దృష్టా ఐఎంఎఫ్ పెట్టిన షరతుల్లో ప్రధానమైన పొదుపు చర్యలపై సిఫార్సులను ఖరారు చేస్తోంది. అయితే ప్రభుత్వం ఈ షరతులను అమలు చేయడానికి ఇష్టపడడం లేదు. దీంతో గత రెండున్నర నెలలుగా ఐఎంఎఫ్‌కు, పాక్ ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. 2019లోనే పాక్‌కు 6 బిలియన్ డాలర్లు అందించడానికి ఐఎంఎఫ్ అంగీకరించింది. అయితే అది పెట్టిన కఠినమైన షరతులను అమలు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

దీంతో పాక్ హామీలను నెరవేర్చలేదన్న కారణంగా ఐఎంఎఫ్ దశలవారీగా విడుదల చేసే ఆ రుణాన్ని నిలిపి వేసింది. గత ఆగస్టులో ఐఎంఎఫ్ బోర్డు పాక్‌కు 1.1 బిలియన్ డాలర్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. కాగా ఇప్పుడు పాక్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఐఎంఎఫ్‌తో కుదుర్చుకున్న రుణ ఒప్పందానికి సంబంధించి తొమ్మిదో సమీక్ష కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ సమీక్ష జరిగితే గత సెప్టెంబర్‌నుంచి పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది.

ప్రతిపక్ష నేత అరెస్టు
మరో వైపు దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు బుధవారం ప్రతిపక్ష తెఫ్రీక్‌ఎ ఇన్సాఫ్( పిటిఐ) పార్టీకి చెందిన సీనియర్ నేత ఫవాద్ చౌదరిని అరెస్టు చేశారు. లాహోర్‌లోని ఫవాద్ నివాసంలో ఆయనను కస్టడీలోకి తీసుకున్నట్లు ఆ పార్టీకి చెందిన మరో నేత ఫరుక్ హబీబ్ చెప్పారు. అరెస్టు తర్వాత ఫవాద్‌ను పోలీసు వాహనాల్లో తీసుకువెళ్తున్న దృశ్యాలను పిటిఐ అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పిటిఐ అధ్యక్షుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రభుత్వం అరెస్టు చేయవచ్చన్న పుకార్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో 52 ఏళ్ల చౌదరిని అరెస్టు చేయడం గమనార్హం. పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు వచ్చే ఆగస్టులో జరగాల్సి ఉంది. అయితే తక్షణం ముందస్తు ఎన్నికలు జరపాలని ప్రధాన ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News