Monday, November 18, 2024

మెటాలో రెండో రౌండ్‌లో 10 వేల ఉద్యోగాల కోత

- Advertisement -
- Advertisement -

కాలిఫోర్నియా : ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్ మరోసారి 10 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. నాలుగు నెలల క్రితం 11 వేల మందిని తొలగించిన కంపెనీ రెండో రౌండ్‌లోనూ అదే స్థాయిలో ఉద్యోగులను ఇంటికి పంపాలనుకుంటోంది. ‘మా బృందం పరిమాణం 10 వేల మందిని తగ్గించనున్నాం, 5000 అదనపు ఉద్యోగుల నియామకం కూడా ఉండదు’ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఇఒ) మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.

ఇప్పటికే కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 13 శాతం ఉద్యోగులను తొలగించగా, ఇప్పుడు కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోత పెట్టనుంది. మెటాలో పునర్నిర్మాణ పనులు విస్తరించడం, తక్కువ ప్రాధాన్యత ప్రాజెక్టులను రద్దు చేయడం, నియామకాల తగ్గింపు వంటి అంశాలు లేఆఫ్‌కు కారణమని కంపెనీ వెల్లడించింది. వార్షికంగా ఖర్చులను 5 బిలియన్ డాలర్ల మేరకు తగ్గించేందుకు జుకర్‌బర్గ్ కట్టుబడి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉండగా, 2022 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 2.90 లక్షల మందిపై వేటుపడింది. దీనిలో 40 శాతం కోతలు 2023లో జరిగాయని లేఆఫ్ ట్రాకింగ్ సైట్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News