Sunday, January 19, 2025

తెలంగాణ పథకాలు మాకూ కావాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా అమలు చేయాలని ఆ రాష్ట్ర రైతుసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తెలంగాణలో వ్యవసాయరంగం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఇక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను తమకూ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలో నవ నిర్మాణ్ కిసాన్ సభ అధ్యక్షుడు అక్షయ్ కుమార్ 10 వేల మంది రైతులతో కలిసి 7రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తున్న పాదయాత్రను పోలీసులు జిల్లా ధన్మండల్ పట్టణంలో అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ భువనేశ్వర్ వరకు పా దయాత్ర చేసి తీరుతామని రైతులు పెద్ద ఎత్తున నినదించారు. శుక్రవారం మరో 5 వేల మంది రైతులు పాదయాత్రలో పాల్గొంటారని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అడ్డుకోవడంతో ధన్మండల్ రైల్వే స్టేషన్‌కు రైతులుపెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటుగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్షయ్ కుమార్ అనే రైతు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై ఇప్పటికే ఒక బృందం అధ్యయనం చేసివెళ్లింది.

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలతోనే అక్కడి రాష్ట్ర ప్రజలు సంపన్నులు అవుతారని కితాబిచ్చింది. ఇరిగేషన్ నుండి మొదలు పెడితే రైతు బంధు వరకు ఎన్నో అద్భుతమైన పథకాలు అమలవుతున్నాయి అంటూ పాదయాత్రలో రైతులు నినాదాలు చేశారు.ఒడిశా రాష్ట్రం రైతులు తమ ప్రధాన డిమాండ్లను అక్కడి ప్రభుత్వం ముందు పెట్టారు. ధాన్యం కు కనీస మద్దతు ధర ప్రకటించాలని, తెలంగాణ రాష్ట్రం లో నేరుగా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ఒడిశా లో కూడా నేరుగా రైతుల వద్దనే ధాన్యం కొనుగోలు చేయాలని, వ్యవసాయ రంగం కు 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, రైతులకు కనీస పెన్షన్ 5 వేలు ఇవ్వాలని రైతులు ఒడిశా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సౌత్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ చైర్మన్ కోటపాటి నరసింహనాయుడు, వెంకటేశ్వర్లు తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.

10 Thousands Farmers padayatra in Odisha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News