ఛండీఘర్: పుట్టిన రోజు నాడు కేక్ తినడం వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పుట్టిన రోజే చిన్నారికి చివరి రోజు కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పంజాబ్ లోని పాటియాలాలో మార్చి 24న ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. పాటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఆన్‌లైన్ ఆర్డర్ ద్వారా ఓ బ్యాకరీ నుంచి కేక్ తెప్పించుకున్నారు. సాయంత్రం ఏడు గంటలకు కేక్ కట్ చేసి ఆనందంగా పంచుకున్నారు. రాత్రి 10 గంటలకు అందరూ అస్వస్థులయ్యారు.
తెల్లవారు జామున 3 గంటలకు వాంతులు ప్రారంభమయ్యాయి. సమీపాన గల ఆస్పత్రికి తీసుకెళ్లగా మాన్వి అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారని మాన్వి తాతయ్య బాధపడుతు చెప్పారు. మాన్వి చెల్లెలు మాత్రం వెంటనే వాంతి చేసుకోవడంతో బ్రతికే అవకాశాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెప్పారు. మాన్వి కుటుంబీకుల ఫిర్యాదుపై పోలీస్‌లు కేసు నమోదు చేశారు. ఎవరైతే ఆ కేకు తయారు చేశారో వారిపై ఆరోగ్య విభాగం చర్యలు తీసుకోవాలని మాన్వి కుటుంబీకులు కోరుతున్నారు.